టెక్నాలజీ పెరిగింది… ఎన్నో ఆధునిక యంత్రాలు, పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.తరతరాలుగా వస్తున్న అనేక వస్తువులు మాయమైపోతున్నాయి. కాని ఎంత టెక్నాలజీ పెరిగి నప్పటికీ వేసవిలో ఈ విసనకర్రల (చేతిపంకాలు)కు డిమాండ్ తగ్గడం లేదు. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వంటివన్నీ ఈ వేసవి లో ఎంత దోహదపడతాయి. అయితే వీటన్నిటికీ విద్యుత్తు మూలం. కాని ఇవేమీ లేకుండా అందరికీ వేసవిలో ఉక్క పోత నుంచి ఉపశమనం ఇస్తాయి ఈ విసనకర్రలు. అందుకనే వాటికి ఆదరణ కొనసాగితూ వస్తుంది. నాలుగైదు దశాబ్దాల క్రితం వరకూ ఇవే అందరికీ చల్లటిని గాలినిచ్చే ఉపకారణాలు.ఇవిలేని ఇల్లుండేది కాదు. కాలమారుతుంది ఆధునిక పరికరాల ద్వారా కృత్రిమ గాలిని పొందుతున్నారు.కాని వీటినే నమ్ముకున్న పెద్ద వయస్సు వాళ్లు నేటికీ వాడుతూనే ఉంటారు.
మిగిలిన కాలాల్లో ఒబ్బిడిగా ఓ చోట భద్రపరచి నప్పటికీ వేసవిలో వాటిని బయటకు తీస్తారు. మరికొందరు కొత్త వాటిని కొనుగోలు చేస్తారు. ఇప్పుడు ఆ కొనుగోలు, అమ్మకాల సీజన్ ప్రారంభమైంది.
*తయారీలో నైపుణ్యం ఉండాలి*
ఈ విసనకర్రలు ఎక్కడబడితే అక్కడ,ఎవరుబడితే వాళ్లు తయారు చేయడం వీలుపడదు.పదునైన తాటాకులను మడిచి అందమైన విసనకర్రలు తయారు చేస్తారు.వీటి తయారీకి విజయనగరం జిల్లా డెంకాడ మండలం జొన్నాడ గ్రామ పరిసర అటవీ ప్రాంతం ప్రసిద్ధి. అక్కడ వందలాది గిరిజన కుటుంబాల వారు జనవరి నెల నుంచి మే నెల వరకూ వీటిని తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నారు.అలాగే తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో కూడా వీటిని తయారు చేసేవాళ్లు ఉన్నారు. వాటిని ఉభయగోదావరి జిల్లాలకు తీసుకొచ్చి విక్రయిస్తారు. కొందరు మోటార్ సైకిల్ పై ఇంటింటికి తిరిగి వీటిని అమ్ముతుంటే మరికొందరు సంతలు,షాపుల వద్ద అమ్మకాలు సాగిస్తారు.వీటిని కొనుగోలు దారులు ఎనిమిది రూపాయలకు కొంటుంటే చిల్లరగా రూ.15 నుంచి ఇరవై రూపాయలకు విక్రయిస్తున్నారు. విజయనగరం ప్రాంతం నుంచి లారీలపై రాజమహేంద్రవరం సమీపంలో గల కడియం మండలం వేమగిరి జంక్షన్ కు తీసుకొచ్చి అక్కడ నుంచి ఉభయ గోదావరి జిల్లాలో అమ్మకాలు సాగిస్తున్నారు.
ముఖ్యంగా ఈ వేసవి కాలంలో జరిగే సీతారాముల కళ్యాణాలలో విసనకర్రల పాత్ర కీలకంగా ఉంటుంది. చేతిలో విసనకర్ర లేకుండా ఈ కళ్యాణ మహోత్సవం తిలకించడం కష్టమవుతుంది. అందుకునే ఉత్సవాలకు వచ్చే భక్తులకు కమిటీ వాళ్లు ఉచితంగా పంపిణీ చేస్తుంటారు.ఉత్సవ కమిటీల వాళ్లు అధిక మొత్తంలో వీటిని కొనుగోలు చేస్తారని విజయనగరం జిల్లాకు చెందిన సత్యనారాయణ అనే విసనకర్రల వ్యాపారి తెలిపారు.