మాధవరం మెగా మెడికల్ క్యాంపును విజయవంతం చేయండి–ఏఎంసి చైర్మన్ సంపత్ కుమార్

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబర్ 14:

 

నియోజకవర్గంలో ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని మహాసంకల్పంతో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ తన సొంత ఖర్చులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మాధవరం మెగా మెడికల్ క్యాంపు ను విజయవంతం చేయాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈనెల 15వ తేదీ బుధవారం తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్ లో మెగా మెడికల్ క్యాంపు జరగనుంది. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ శిబిరం కొనసాగుతుంది. మాధవరం పీహెచ్ సి పరిధిలోని అన్ని గ్రామాల నుంచి వైద్య సహాయం అవసరమైన వారిని ఈ శిబిరానికి తీసుకువచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం పొందేలా అందరూ కృషి చేయాలని సంపత్ విజ్ఞప్తి చేశారు. మాధవరం మెగా మెడికల్ క్యాంపు విజయవంతానికి గాను తాడేపల్లిగూడెం మండల పరిషత్ మీటింగ్ హాలులో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంపత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టారని పేర్కొన్నారు. దీంతోపాటు మన నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రాజమండ్రి జిఎస్ఎల్ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడే పూర్తి ఆధునిక సదుపాయాలతో కూడిన రెండు మొబైల్ మెడికల్ యూనిట్లను ఎక్కడకు తీసుకువచ్చి మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందన్నారు. స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా వచ్చి వివిధ విభాగాలు వైద్య సేవలు అందిస్తారు అన్నారు. గుండె, ఊపిరితిత్తులు, ఎముకలు, కిడ్నీ, క్యాన్సర్ స్త్రీ సంబంధిత వ్యాధులు కు ఉచితంగా పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుందన్నారు. అవసరమైన వారికి మరింత మెరుగైన వైద్యం కోసం రెఫరల్ ఆస్పత్రులకు పంపించడంతోపాటు వారికి పూర్తిగా నయం అయ్యే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుని మందులు కూడా ఉచితంగా సరఫరా చేస్తుందని సంపత్ వివరించారు. ఈ కార్యక్రమం విశిష్టతను ప్రజలందరికీ తెలియజేసి అవసరమైన వారు మెగా మెడికల్ క్యాంపునకు వచ్చి పరీక్షలు చేయించుకుని మరింత మెరుగైన వైద్యం, మందులు ఉచితంగా పొందాలని అవగాహన కలిగించాలని ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ తెలియజేశారు. బుధవారం మాధవరం లో జరిగే మెగా మెడికల్ క్యాంపునకు అన్ని గ్రామాల నుంచి ప్రజలు విరివిగా తరలివచ్చి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో విశ్వనాధ్, ఈవోఆర్ డి.వెంకటేష్, మాధవరం పిహెచ్ సి డాక్టర్ వెంకటేష్, ఇంకా వివిధ గ్రామాల కార్యదర్శులు,ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం లు, ఏపిఎం, సీఏ లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఏఎంసీ చైర్మన్ గా నియమితులై బాధ్యతలు స్వీకరించిన ముప్పిడి సంపత్ కుమార్ ను ఎంపీడీవో విశ్వనాథ్, ఈ ఓ ఆర్ డి వెంకటేష్, పంచాయతీలు కార్యదర్శులు ఘనంగా సన్మానించారు.