బాలికల అభ్యున్నతికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి….. జిల్లా కలెక్టర్ పిలుపు…….

 

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, నవంబర్ 14:

 

బేటి బచావో బేటి పడావో కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్ళి బాలికల అభ్యున్నతకి అందరూ ఐక్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి అన్నారు.మంగళవారం స్థానిక ఏయస్ఆర్ నగర్ అల్లూరి సీతారామరాజు కళా కేంద్రంలో బేటి బచావో బేటి పడావో వర్క్ షాప్ లో జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ నేడు ఆడపిల్లలను పుట్టనిద్దాం, ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లను చదివిద్దాం అనే సందేశాన్ని మనం ఆచరించి, సమాజానికి అందరికీ తెలిసేలా చేసినప్పుడే మార్పు ఉంటుందన్నారు. ఆడ, మగ సమాన నిష్పత్తులు ఉండేలా చూడాలని, లింగ నిర్ధారణ జరిపే స్కానింగ్ సెంటర్లపై ఉక్కు పాదం మోపాలన్నారు. నూటికి నూరు శాతం కాన్పులు ప్రభుత్వాసుపత్రిలో జరిగే చూడాలని, అవి సులువు కాన్పులు అయ్యేలా చూడాలన్నారు. గర్భిణీ అనగానే పేరు నమోదు చేసి డెలివరీ అయ్యేవరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. నెలసరి పరిశుభ్రత పై ప్రతి బాలికలకు అవగాహన కల్పించాలన్నారు. బాలికలు, గర్భిణీ స్త్రీలకు రక్తహీనత లేకుండా మంచి పోషకాహారం అందించి మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలన్నారు. 9, 10 తరగతి లోపు చిన్నారులకు బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేక దృష్టి పెట్టి , ఎక్కడ ఒక్క బాల్య వివాహాలు కేసు నమోదు కాకూడదన్నారు. బడిఈడు పిల్లలు బడిలోలే ఉండాలని అన్నారు. ఆడపిల్లను రక్షించండి ఆడపిల్లలకు చదువు చెప్పండి స్లోగన్ లు వరకే పరిమితం కాకుండా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆడ, మగ లింగ వివక్షతను ప్రజల మనసుల నుండి దూరం చేయాలన్నారు. ప్రతినెల పాఠశాలలో ఆడపిల్లలకు రక్త పరీక్షలు నిర్వహించి ప్రోగ్రెస్ కార్డు లాగా అందజేయాలన్నారు. స్త్రీ, పురుష సమానత్వం ఇంకా అంతంత మాత్రం గానే ఉందని, ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లవాడు చేసిన ఒకే తప్పను ఒకేలా చూడలేని పరిస్థితిలో ఉన్నామని ఆ పరిస్థితిలో మార్పు రావాలన్నారు. ఆడపిల్ల అయితే వృద్ధాప్యంలో బాగా చూసుకుంటుందని, మగ పిల్లవాడు అయితే చూడడని కొందరిలో మాత్రమే ఆలోచన ఉందన్నారు. మనం మగ పిల్లవాడు అయితే పుట్టినరోజు బాగా జరుపుతామని, అదే ఆడపిల్ల అయితే సరిగ్గా పుట్టినరోజు జరపమని ఈ వివక్షత పోవాలన్నారు. వైద్య శాఖ, విద్యాశాఖ , శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆడ పిల్లల విద్యా, ఆరోగ్యంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలన్నారు. ఈ అంశంపై సమావేశాలు, సభలు, ర్యాలీలు, చర్చా గోష్ఠిలు తదితర కార్యక్రమాలు విస్తృతంగా జరిపి ప్రజల అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమానికి నిజమైన అర్ధం తీసుకువచ్చి నవసమాజ స్థాపనకు మనందరం కృషి చేద్దామని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు.ముందుగా జిల్లా కలెక్టరు జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్ షాప్ ను ప్రారంభించారు. బాలికలు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.ఆడపిల్లను రక్షిద్దాం ఆడపిల్లను చదివిద్దాం పోస్టర్లను జిల్లా కలెక్టరు ఆవిష్కరించారు.అందరి చేత జిల్లా కలెక్టరు ప్రతిజ్ఞ చేయించారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకట రమణ, ఐసిడిఎస్ పిడి బి.సుజాత రాణి, డిసిపివో అధికారి డా. సి హెచ్ సూర్య చక్ర వేణి, డిఐవో డా. దేవ సుధ, మండల ఉప విద్యాశాఖ అధికారి డి శ్రీరామ్, పురపాలక సంఘం కమిషనరు యం శ్యామల, వైద్యాధికారులు, హెల్త్ సూపరు వైజర్లు, మండల విద్యా శాఖ అధికారులు, సిడిపివోలు, అంగనవాడీ సిబ్బంది , ఏయన్ యంలు ,ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.