Headlines

గేర్ మార్చిన కేసీఆర్, లోక్ సభ బరిలో కేటీఆర్ – హరీష్ కు కీలక బాధ్యతలు..!!

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ పరంగా కీలక మార్పులకు సిద్దమయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతున్నారు. స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించారు. ఇదే సమయంలో కేటీఆర్ ను లోక్ సభకు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హరీష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వటం ఖాయమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

కొత్త లెక్కలు: తెలంగాణలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీ పరంగా కీలక మార్పులకు రంగం సిద్దమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పుంజుకోవటంతో పార్టీ తిరిగి లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటకపోతే నష్టం తప్పదనే అభిప్రాయంతో ఉన్నారు. దీంతో..లోక్ సభ ఎన్నికల అభ్యర్దుల ఎంపిక పైన కసరత్తు ప్రారంభించారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం పైన దూకుడుగా వ్యవహరించేలా కార్యాచరణ సిద్దం చేసారు. పార్టీలో కీలక పదవుల్లో మార్పులు తప్పవనే సంకేతాలు ఇస్తున్నారు. కేసీఆర్ ఇక పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ఇదే సమయం లో పార్టీలో కేటీఆర్ – హరీష్ కు కీలక బాధ్యతలు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

 

పార్లమెంట్ కు కేటీఆర్: ప్రస్తుతం కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. హరీష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను కేటాయించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీలో కేడర్ లో హరీష్ నాయకత్వం పైన నమ్మకం ఉంది. కేడర్ తోనూ హరీష్ కు సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీకి పలు సందర్భాల్లో హరీష్ ట్రబుల్ షూటర్ గా వ్యవహరించారు.

 

అనేక సందర్భాల్లో కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతల నిర్వహణలో సక్సెస్ అయ్యారు. కేటీఆర్ ను లోక్ సభకు పంపాలనేది కేసీఆర్ తాజా ఆలోచనగా తెలుస్తోంది. మల్కాజ్ గిరి లేదా సికింద్రాబాద్ నుంచి కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగటం దాదాపు ఖాయమైందని పార్టీ వర్గాల సమాచారం.

 

హరీష్ కు కీలక బాధ్యతలు: అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బాధ్యతల నిర్వహణకు కేసీఆర్ సిద్దమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కానున్నారు. లోక్ సభ ఎన్నికల వేళ ఆ సమావేశాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ కు కీలకంగా మారనున్నాయి. కవితను ఎమ్మెల్సీగా కొనసాగిస్తూ..కేటీఆర్ ను లోక్ సభ బరిలో దించటం ద్వారా పార్లమెంట్ లోనూ పార్టీ వాయిస్ బలంగా వినిపించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

 

మహారాష్ట్రలోని లోక్ సభ సీట్లలోనూ బీఆర్ఎస్ పోటీ చేయనుండటంతో కేటీఆర్ కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలనేది కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, త్వరలోనే కేసీఆర్ పార్టీలో మార్పులు..లోక్ సభ ఎన్నికల కార్యాచరణ ప్రకటన చేసేందుకు సిద్దమవుతున్నారు.