Headlines

పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో కీలక పరిణామం – కలిసొచ్చేదెవరికి..!!

తెలంగాణలో లోక్ సభ పోలింగ్ ముగిసింది. మెజార్టీ సీట్ల గెలుపు పైన మూడు ప్రధాన పార్టీలు భారీ అంచనాలతో ఉన్నాయి. ఇదే సమయంలో తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సైతం ఈ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ గెలుపును రేవంత్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. ఇదే సమయంలో ఈ ఎన్నిక వేళ కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి.

 

ఆసక్తి కర పోరు వరంగల్ -ఖమ్మం -నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నిక ఆసక్తి కరంగా మారుతోంది. 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 52మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగుల రాకే్‌షరెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రచారానికి మూడు రోజులు గడువు మాత్రమే ఉండడంతో అభ్యర్థులతో పాటు వారి తరపున కీలక నేతలు బరిలోకి దిగారు.

 

CM Revanth focus on Graduate MLC election in Telangana fixed road map for party leaders

మూడు పార్టీల ప్రచారం గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ఉమ్మడి జిల్లాల మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, సీతక్క తోపాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ప్రచారం సాగిస్తున్నారు. పట్టభద్రుల నియోజక వర్గం ఏర్పాటైనప్పటినుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికలోనూ సీటును నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపు కోసం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రంగంలోకి దిగారు.ఈ సీటును దక్కించుకోవడం ద్వారా ప్రశ్నించే ప్రతిపక్షంగా తాము పనిచేస్తామని బీఆర్‌ఎస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

ప్రతిష్ఠాత్మకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి గెలుపునకు శ్రమిస్తున్నారు. గ్రాడ్యుయేట్స్‌ను తమ వైపు తిప్పుకునేందుకు కిషన్‌రెడ్డి.. వరంగల్, యాదాద్రి జిల్లాలో ప్రచారం చేశారు. ప్రత్యర్థులకంటే మెరుగ్గా పోరాడి మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించాలనే పట్టుదలతో బీజేపీ నాయకులు ప్రచారం సాగిస్తున్నారు. పట్టభద్రులస్థానంలో తమ అభ్యర్థి ప్రేమేందర్‌ను గెలిపించాలి అని కోరుతున్నారు. మూడు జిల్లాల ఫట్టభద్రులు డిసైడ్ చేసే ఎన్నిక కావటంతో మూడు పార్టీలకు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇక్కడ గెలుపు పై మూడు ప్రదాన పార్టీలకు సవాల్ గా నిలుస్తోంది. దీంతో..ఎన్నికల ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతోంది.