Headlines

హైదరాబాద్ మెట్రో విస్తరణ – కొత్త మార్గాలపై కీలక నిర్ణయం..!

హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి డీపీఆర్ సిద్దం అవుతోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ప్రభుత్వానికి ఈ నివేదికలు అందిచేందుకు నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి అధికారిక ఆమోదం వచ్చిన తరువాత కారిడార్‌ల వారీగా టెండర్లు పిలిచే ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. దాదాపు 70 కిలో మీటర్ల మేర రెండో దశ నిర్మాణానికి కసరత్తు కొనసాగుతోంది. ఏడు మార్గాల్లో ఈ మేర అధ్యయనం చేసారు.

 

ముమ్మర కసరత్తు హైదరాబాద్ లో మెట్రో రెండో దశ విస్తరణ పైన కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రభుత్వం ఆమోదించిన 7 మెట్రో కారిడార్‌లలో మొత్తం 70 కి.మీ మేర నిర్మించే మార్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో సర్వేలు, ట్రాఫిక్‌ అధ్యయనం, మెట్రో స్టేషన్‌లు, డిపోల నిర్మాణం వంటి అంశాలపై హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ సిస్ట్రా కన్సల్టెన్సీ సంస్థతో పనిచేస్తూ డీపీఆర్‌ సిద్దం చేస్తోంది. క్షేత్ర స్థాయి అధ్యయనం తుది దశకు చేరింది. ఎన్నికల కోడ్ పూర్తయిన తరువాత ప్రభుత్వానికి డీపీఆర్ అందిచనున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీ, భవిష్యత్తు రవాణా అవసరాల దృష్ట్యా, విమానాశ్రయానికి మెట్రో రైలు మార్గం ద్వారా కనెక్టివిటీ ఉండేలా రెండో దశ మెట్రో నిర్మాణాన్ని 70 కి.మీ మేర చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

7 మార్గాల్లో విస్తరణ తాజా ప్రణాళికలకు అనుగుణంగా 7 మార్గాల్లో అధ్యయనం చేసి డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.20వేల కోట్ల వ్యయం అవుతుందని ఇప్పటికే మెట్రో అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. రెండో విడతలో ప్రధనంగా నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ మీదుగా చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి, మామిడిపల్లి కలుపుతూ విమానాశ్రయం లోపలి వరకు మెట్రో రూట్‌ను 29 కి.మీ మేర ఖరారు చేశారు. కొత్తగా ఖరారు చేసిన మొత్తం 70 కి.మీ మెట్రో మార్గాల్లో వివిధ ప్రాంతాలను కలుపుతూ ఉండగా, అందులో అతి పొడవైన మెట్రో మార్గంగా నాగోల్‌-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ఉంది. దీని తర్వాత మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి బీహెచ్‌ఈఎల్‌ మీదుగా పటాన్‌చెరు వరకు 14 కి.మీ మేర విస్తరించేలా ప్లాన్ చేస్తున్నారు.

 

వేగంగా విస్తరణ అదే విధంగా..రాయదుర్గం మెట్రో స్టేషన్‌ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్‌, నానక్‌రామ్‌గూడ జంక్షన్‌, విప్రో జంక్షన్‌, అమెరికన్‌ కాన్సులేట్‌ (ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌) వరకు 8 కి.మీ, ఎల్‌బీనగర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి వనస్థలిపురం, హయత్‌నగర్‌ వరకు 8 కి.మీ, మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరాంఘర్‌ మీదుగా రాజేంద్రనగర్‌లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం వరకు 4 కి.మీ, ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌ రోడ్డు వరకు 1.5 కి.మీ, ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ చొప్పున విస్తరించేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంలో ఎంతో అనుభవం ఉన్న సిస్ట్రా కన్సల్టెన్సీ సంస్థ ప్రభుత్వం నిర్ధేశించిన మార్గాలకు వేర్వేరుగా డీపీఆర్‌లను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.