- ఇంటింటి సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి……
- దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల జాబితా అందించాలి….
- కోకో కోల సంస్థ పరిశ్రమ స్థాపనకు అనువైన స్థలం పరిశీలన….
న్యూస్ 9 tv రిపోర్టర్
మంథని, పెద్దపల్లి.
ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కోరారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంథని మండలంలోని ఆరెంద, అడవి సోమనిపల్లి గ్రామాలలో పర్యటించారు. ఆరెంద గ్రామంలో జరుగుతున్న ఇంటింటి సర్వే తీరు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అడవి సోమనపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 192 లో కోకో కోలా కంపెనీ స్థాపనకు గుర్తించిన 80 ఎకరాల స్థలాన్ని కోకోకోలా కంపెనీ ప్రతినిధులు, టి.జి.ఐ.ఐ.సి వైస్ చైర్మన్ & ఎండి విష్ణువర్ధన్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆరెంద గ్రామంలో జరుగుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఎన్యుమరేటర్ ను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని, సర్వే కోసం ఇళ్లకు వచ్చే ఎన్యుమరేటర్ లకు వాస్తవిక వివరాలతో కూడిన సమాచారం అందించాలని కలెక్టర్ తెలిపారు.
ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన ఇండ్లను సందర్శించి ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పకడ్బందీగా సర్వే జరపాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు.
పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు వెంకటాపురం గ్రామం నుంచి ప్రత్యేక తరగతులకు హాజరయ్యేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న కలెక్టర్, దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల జాబితా అందించాలని, సదరు విద్యార్థులకు సైకిల్ లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అనంతరం అడవి సోమనపల్లి గ్రామంలో కోకో కోలా అంతర్జాతీయ సంస్థ ఏర్పాటుకు కేటాయించిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, తహసిల్దార్ రాజయ్య, టి.జి.ఐ.ఐ.సి చీఫ్ ఇంజనీర్ వినోద్ కుమార్, టి.జి.ఐ.ఐ.సి జోనల్ మేనేజర్ పద్మజ, డిప్యూటీ జోనల్ మేనేజర్ మహేశ్వర్ , హెడ్మాస్టర్ శ్రీలత సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.