సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారంలోని మైలాన్ పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారంలోని మైలాన్ పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. కెమికల్ ద్రావకాన్ని డ్రమ్ములోకి మారుస్తున్న సమయంలో మంటలు చెలరేగి ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామికవాడలోని మైలాన్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు కాగా మరొకరు వేర్ హౌస్ అసిస్టెంట్ మేనేజర్. గోదాంలో కార్మికులు పనిచేస్తున్న సమయంలో ఉదయం 11.45 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంటలు ఇలా చెలరేగాయి.. మైలాన్ పరిశ్రమలో రోజూలాగే.. ఆదివారం వేర్ హౌస్ లో కార్మికులు పనులకు హాజరయ్యారు.

సాల్వెంట్ సరఫరా గదిలో.. టెట్రా మీథైల్ డిసీలాక్సేన్ (Tetra methyle disiloxane) ద్రావకాన్ని ఒక డ్రమ్ము నుంచి వేరే డ్రమ్ములోకి మార్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో.. స్ట్రాటిక్ ఎనర్జీ ఫ్లాష్ ఫైర్ రావడంతో.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ద్రావకం కారణంగా క్షణాల్లోనే మంటలు భారీగా ఎగసిపడ్డాయి. పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులు పరితోష్ మెహతా (40), రంజిత్ కుమార్ (27)… సహా వేర్ హౌస్ అసిస్టెంట్ మేనేజర్ అయిన శ్రీకాకుళానికి చెందిన లోకేశ్వరరావు (38) మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. తోటి కార్మికులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షి రాజేశ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇండస్ట్రియల్ ఏరియాల్లో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రసాయన ద్రావకాలు, ఔషధ తయారీ పరిశ్రమల్లో పటిష్ట రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే… చాలా పరిశ్రమల్లో సేఫ్టీ చర్యలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేవన్న విమర్శలు ఉన్నాయి. పరిశ్రమల శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నందు వల్లే యాజమాన్యాలు కూడా ఈ అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు రెండు రోజులు తనిఖీల పేరిట హడావుడి చేస్తారని… ఆ తర్వాత షరామామూలే అవుతుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదకర ద్రావకాలతో పనిచేసే కేంద్రాల్లో.. కార్మికుల రక్షణకు అన్ని చర్యలు పక్కాగా అమలు చేసే విధంగా యాజమాన్యాలను ఆదేశించాలనే డిమాండ్లు వస్తున్నాయి.