Headlines

కేరళలో విషాదం.. బోటు బోల్తాపడి 20 మంది జల సమాధి!

కేరళలో విషాదం.. బోటు బోల్తాపడి 20 మంది జల సమాధి!

కేరళలో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బోటు బోల్తాపడి 20 మంది మృత్యువాత పడ్డారు. మలప్పురం జిల్లా తనూర్ పట్టణంలోని తువల్‌తీరం బీచ్ సమీపంలో గత రాత్రి 7 గంటల సమయంలో జరిగిందీ ఘటన. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న హౌస్‌బోటు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. మృతుల్లో మహిళలు, ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో వీరంతా విహారానికి వచ్చి ఇలా ప్రమాదం బారినపడ్డారు.

పడవ బోల్తా పడడానికి కారణం తెలియరాలేదని, మృతుల్లో చాలామంది పడవ అడుగు భాగంలో చిక్కుకుపోయారని క్రీడల మంత్రి అబ్దు రహిమాన్ తెలిపారు. పర్యాటకశాఖ మంత్రి పీఏ మహమ్మద్ రియాజ్‌తో కలిసి ఆయన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

పడవ బోల్తా ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేరళలో పడవ బోల్తా ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు.