Headlines

పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నా – ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..!!

జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర కేంద్రంగా ఏపీ రాజకీయం కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలని పవన్ కల్యాణ్ పదే పదే కోరుతున్నారు.

పొత్తుల అంశం మాత్రం ప్రస్తావన చేయటం లేదు. వైసీపీ లక్ష్యంగా పవన్ విమర్శలు కొనసాగుతున్నాయి. వైసీపీ నేతలు పవన్ కు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. ఈ సమయంలోనే ఏపీ మంత్రి విశ్వరూప్ కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ సీఎం కావాలని తాను కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

వైసీపీ టార్గెట్ గా పవన్ యాత్ర: పవన్ కల్యాణ్ వారాహి యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్..వైసీపీ నేతలే లక్ష్యంగా పవన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. గోదావరి జిల్లాలను వైసీపీ విముక్త జిల్లాలుగా చేయాలని పవన్ పిలుపునిచ్చారు. వారాహి సభల్లో తనకు సీఎం గా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.

టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని వైసీపీ బలంగా నమ్ముతోంది. దీంతో..చంద్రబాబు..పవన్ లక్ష్యంగా వైసీపీ నేతలు పవన్ ఆరోపణలను తిప్పి కొడుతున్నారు. ఇదే సమయంలో పవన్ సీఎం చేయాలనే నినాదం పైన మంత్రి విశ్వరూప్ స్పందించారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నాను అని మంత్రి విశ్వరూప్ వ్యాఖ్యానించారు.

సీఎం కావాలని కోరుకుంటున్నా: రాష్ట్రంలో ఏ నాయకుడు అయినా పాదయాత్ర..వారాహి యాత్ర చేసుకోవచ్చన్నారు. పవన్ సీఎం కావాలంటే రాష్ట్రంలోని ఆ పార్టీ 175 స్థానాల్లో పోటీ చేసి 88 సీట్లు సాధించాలని పేర్కొన్నారు. లేని పక్షంలో వంద స్థానాల్లో పోటీ చేసి 50 సీట్లలో గెలిచి సీఎం కావాటానికి ప్రయత్నించాలని సూచించారు. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం పురోగమిస్తోందని..నాలుగేళ్లలో ఒక్క మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించలేదని మంత్రి గుర్తు చేసారు.

నవరత్నాలతోపేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పని చేస్తున్నారని వివరించారు. మరో మంత్రి రోజా పవన్ కు పార్టీ గుర్తు లేదని..జిల్లా అధ్యక్షులు లేరని..నియోజకవర్గాలకు అభ్యర్దులు లేరని ఎద్దేవా చేసారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న పవన్ సీఎం జగన్ ను ఎలా ఓడిస్తారని ప్రశ్నించారు.