మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి
-ఏపీ నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జూన్26:
మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. ఏపీ నిట్ ప్రాంగణంలోని పరిపాలనా భవనం వద్ద అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధి దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ యువత మత్తుపదార్థాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి మత్తుపదార్థాలు విద్యార్థులపాలిట కాలకూట విషంగా పరిణమిస్తున్నాయని చెప్పారు. మత్తుగా, గమ్మత్తుగా మనిషి ఆరోగ్యాన్ని గుల్ల చేసే మాదకద్రవ్యాలకు ఒక్కసారి అలవాటుపడితే అవి వ్యసనాలుగా మరి బానిసలుగా మార్చేస్తాయని తెలిపారు. ఆయుస్సును హరించే ఇటువంటి దురలవాట్లుకు దూరంగా ఉంటూ, మాదకద్రవ్యరహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల జోలికి పోకుండా చదువుపై దృష్టిసారించి తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాలని వివరించారు. ముందుగా సిబ్బందితో రిజిస్ట్రార్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీన్ లు డాక్టర్ జీబి వీరేష్ కుమార్, డాక్టర్ టి.కురుమయ్య, ఆచార్యులు డాక్టర్ వి.సందీప్, డాక్టర్ కిరణ్ తీపర్తి, డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.