Headlines

మాజీ ఎంపీ సోలిపేట కన్నుమూత: కేసీఆర్, హరీశ్ రావు సంతాపం

హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యు(రాజ్యసభ) సోలిపేట రామచంద్రారెడ్డి మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. 92 ఏళ్ల రామచంద్రారెడ్డి అస్వస్థతో హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు.

నగరంలోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం జరపనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ఇతర రాజకీయ నేతలు సోలిపేట మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

సిద్దిపేట జిల్లా చిట్టాపూర్‌ గ్రామానికి చెందిన సోలిపేట రామలింగారెడ్డి.. సర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం దుబ్బాక సమితి దుబ్బాక సమితి అధ్యక్షుడిగా, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా, ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా సేవలందించారు. ఆ తర్వాత తొలిసారి దొమ్మాట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

కాగా, తొలితరం కమ్యూనిస్టు నేతగా, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న సోలిపేట రామచంద్రారెడ్డి జీవితం.. అందరికీ ఆదర్శవంతమైందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజా జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగిన క్రమం రేపటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

సిద్దిపేట ప్రాంత వాసిగా రాజకీయ, సామాజిక రంగాల్లో ఆయన ఆచరించిన కార్యాచరణ… ప్రజా జీవితంలో కొనసాగుతున్న తమలాంటి ఎందరో నేతలకు ప్రేరణగా నిలిచిందన్నారు. సోలిపేట రామచంద్రారెడ్డి మరణంతో తెలంగాణ మరో తొలితరం ప్రజానేతను కోల్పోయిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

సోలిపేట మరణం పట్ల తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతాపం ప్రకటించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన పాత్ర స్ఫూర్తిదాయకమని అన్నారు. సర్పంచి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎదిగి.. ప్రజల మన్ననలు పొందిన నేత సోలిపేట అని తెలిపారు. ఈ సందర్భంగా సోలిపేట కుటుంబసభ్యులకు హరీశ్‌రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సోలిపేట మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. సోలిపేట ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా సోలిపేట మృతి పట్ల సంతాపం ప్రకటించారు.