ఆలమూరు (చింతలూరు)
చింతలూరు లో వేంచేసి ఉన్న జగన్మాత శ్రీ నూకంబిక అమ్మవారు గుప్త నవరాత్రుల్లో భాగంగా ఆషాడ శుద్ధ నవమి మంగళవారం నాడు శాకంబరీ దేవిగా దర్శనమిచ్చారు. పూర్వం దుర్గమాసురుడనే రాక్షసుడు వేదాలను అపహరించి లోకంలో యజ్ఞయాగాది క్రతువులు జరగకుండా అడ్డుకున్నాడు, ఆ సమయంలో లోకమంతా కరువుతో అల్లాడి చీకట్లు అలముకున్నాయి. ఆ సమయంలో మహర్షులు అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు దివ్య తేజస్సుతో శతాక్షి దేవిగా అవతరించి వానలు కురిపించారు. శాకంబరిగా మారి లోకంలో వారందరికీ శాకములు ఇచ్చి పోషించారు. శాకాంబరి అవతారంలో అమ్మవారిని దర్శించుకున్న వారికి అన్న పానీయాలకు లోటు ఉండదని పురాణాలు చెబుతున్నాయి. చింతలూరులో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శాఖాంబరి అమ్మవారి అలంకరణలో దర్శనమివ్వడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.