Headlines

ఎన్డీఏ సమావేశానికి పవన్.. జనసేనకు అందిన BJP ఆహ్వానం

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హాట్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది.

వైసీపీ టార్గెట్ గా జనసేన మాటల దాడిని పెంచుతోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్తూనే… అధికార పార్టీపై విమర్శలు చేస్తోంది. ఇప్పటికే తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని జగన్ స్పష్టం చేసిన వేళ… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయనే చర్చ నడుస్తోంది. గత ఎన్నికల సందర్భంగానే బీజేపీకి దూరమైన టీడీపీ…. మళ్లీ బీజేపీ కలుస్తుందా…? అందుకు కమలనాథులు సై అంటారా అనేది ప్రశ్నగానే మిగిలింది. పవన్ మాత్రం… మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని పలుమార్లు పరోక్షంగా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో… బీజేపీకి పవన్ కు గ్యాప్ పెరిగిందన్న వార్తలు కూడా వచ్చాయి. టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తాయని అంతా భావిస్తున్నారు. కట్ చేస్తే… జనసేన అధినేత పవన్ కు బీజేపీ హైకమాండ్ ఆహ్వానం అందించింది. ఇది కాస్త ఏపీ రాజకీయాల్లో టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.

ఈ నెల 18వ తేదీన ఢిల్లీ వేదికగా బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) భేటీ కానుంది. ఇందులో పాల్గొనాల్సిందిగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ఆహ్వానం అందించింది బీజేపీ హైకమాండ్. ఎన్డీఏ సమావేశానికి రావాలని ఇప్పటికే భాగస్వామ్య పక్షాల అగ్ర నాయకులకు ఆహ్వానాలు పంపిన బీజేపీ నాయకత్వం.. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ను ఆహ్వానించింది. ఈ ఆహ్వానానికి సంబంధించి పవన్ కూడా కీలక ప్రకటన చేశారు. 18వ తేదీన ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి హాజరవుతామని ప్రకటించారు. పార్టీ తరపున నాదెండ్ల మనోహర్ కూడా ఈభేటీలో పాల్గొననున్నట్లు తెలిపారు.

పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులకు మద్దతు కోరడం, రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల బల ప్రదర్శన లక్ష్యంగా ఈ సమావేశాన్ని తలపెట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీ అశోక హోటల్‌లో జరగనున్న ఈ భేటీకి పాత, కొత్త మిత్రుల్ని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ సర్కార్ నుంచి వైదొలిగిన పంజాబ్ రాష్ట్రంలోని శిరోమణి ఆకాలీదళ్ పార్టీకి సైతం ఆహ్వానం అందినట్లు సమాచారం. అయితే గతంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం అందిందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అదే జరిగితే… చంద్రబాబు హాజరవుతారా…? లేదా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.

వైసీపీ కూడా బీజేపీకి సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంలో చేరకపోయినప్పటికీ.. అన్ కండిషనల్ గా ప్రతి విషయంలోనూ మద్దతుగా నిలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో చూస్తే.. వైసీపీ టార్గెట్ గా పవన్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో. ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి..!