Headlines

సీఐ అంజూ యాదవ్ పై జనసేన న్యాయపోరాటం, ఎస్పీకి వినతిపత్రం ఇచ్చేందుకు తిరుపతికి పవన్

శ్రీకాళహస్తిలో ఇటీవల నిరసన తెలుపుతున్న జనసేన కార్యకర్త కొట్టే సాయిని సీఐ అంజూ యాదవ్ చెంప దెబ్బలు కొట్టారు. మరో జనసేన కార్యకర్తను కాలర్ పట్టుకుని స్టేషన్ కు లాక్కెళ్లారు.

ఈ ఘటనపై మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి. సీఐ అంజూ యాదవ్ అనుచిత ప్రవర్తనపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనను జనసేన సీరియస్ గా తీసుకుంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. సోమవారం నేరుగా తిరుపతికి వెళ్లి ఎస్పీకి వినతి పత్రం అందించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. జిల్లా ఎస్పీ ద్వారా డీజీపీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ విషయంపై శనివారం మధ్యాహ్నం ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు పవన్ కల్యాణ్.

మానవ హక్కుల సంఘం నోటీసులు

జనసేన కార్యకర్తపై శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా అయింది. దీంతో సీఐ అంజు యాదవ్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై నేరుగా శ్రీకాళహస్తికి వచ్చే తేల్చుకుంటామంటూ ప్రకటించారు. మరోవైపు సీఐ అంజూ యాదవ్‌పై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. సుమోటోగా స్వీకరించింది. సీఐకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27 లోపు సమాధానం ఇవ్వాలని మానవ హక్కుల సంఘం ఆదేశించింది. ఈ వ్యవహారం టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఒకవర్గం పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ… ప్రతిపక్షనేతలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని చిత్రహింసలకు గురిచేస్తున్నారని, దోషులను వదిలిపెడుతున్నారని ఫిర్యాదు చేశారు.

అసలేం జరిగింది?

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ ఇటీవల ఆందోళన చేస్తున్న జనసేన నేతలపై చెంపదెబ్బలతో విరుచుకుపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లిమండం వద్ద సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు జనసేన నేతలు ప్రయత్నించారు. సీఎం దిష్టిబొమ్మ దహనానికి అంగీకరించబోమని సీఐ అంజు యాదవ్‌ జనసేన నేతలకు తేల్చిచెప్పారు. ఈ నిరసన కార్యక్రమానికి యత్నించడంతో పలువురు నేతలను శ్రీకాళహస్తి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొంతమంది జనసేన నేతలు పోలీసుల కళ్లుగప్పి పెళ్లిమండపం కూడలి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో జనసేన నేతలపై సీఐ అంజు యాదవ్ విరుచుపడ్డారు. జనసేన నేత రెండు చెంపలపై కొట్టారు. సీఐ దురుసు ప్రవర్తనను వీడియో తీస్తున్న వ్యక్తిపైనా ఆమె దాడికి పాల్పడ్డారు. ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. సీఐ ప్రవర్తన చర్చనీయాంశమైంది. జనసేన నేతపై సీఐ దాడి చేసిన వీడియో వైరల్ అయింది. సీఐ తీరుపై జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఓ మహిళ పట్ల సీఐ అనుచితంగా ప్రవర్తించిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. గతంలో ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు సీఐ.