Headlines

దళితులు సాగు చేసే భూములపై గ్రామ రెవిన్యూ అధికారుల దాడులు ఆపాలి

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జూలై 18:

ఏళ్ల తరబడి సాగుచేసుకొనే దళితుల భూముల్లో గ్రామ రెవెన్యూ అధికారుల వేధింపులు ఆపాలని కె.వి.పి.ఎస్, డి.హెచ్.పి.ఎస్, కె.ఎన్.పి.ఎస్ జిల్లా కార్యదర్శులు కే.క్రాంతి బాబు, కళింగ లక్ష్మణరావు, గెడ్డం జార్జి డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని కొండ్రు ప్రోలు గ్రామంలో ఏళ్ళ తరబడి సాగు భూముల సాగు చేసుకుంటున్న దళితులపై గ్రామ రెవెన్యూ అధికారుల వేధింపులు ఆపాలని కోరుతూ కె.వి.పి.ఎస్, డి.హెచ్.పి.ఎస్, కె.ఎన్.పి.ఎస్ సంఘాల ఆధ్వర్యంలో బాధితులతో కలిసి ఎమ్మార్వో వై. దుర్గా కిషోర్ కి తాడేపల్లిలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కె.క్రాంతి బాబు, కళింగ లక్ష్మణరావు, గెడ్డం జార్జి మాట్లాడుతూ తరతరాలుగా,ఏళ్ల తరబడి గ్రామాల్లో దళితులు సాగు చేసుకునే భూముల్లో రెవెన్యూ అధికారులు అడ్డుకుని వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చే భూములను సాగుచేసుకుంటుంటే ఇళ్లస్థలాలు పేరుతో స్వాధీనం చేసుకుంటామని బెదిరించడం దారుణమన్నారు. దళితుల అధీనంలో ఉన్న భూములకు తక్షణం పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుమారు 0.35సెంట్లు భూమికి పట్టాలు ఉన్నాయని చెప్తున్నా అధికారులు వినకపోవడం దారుణమన్నారు. ఇళ్ళ స్థలాలు, పేదలు పేరుతో దళితుల పొట్ట కొట్టడం అన్యాయమన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు వేధింపులకు పాల్పడటం , కొంతమంది ఆక్రమణ దారులతో భూముల్లోకి వెళ్ళడం మానుకోవాలన్నారు. తక్షణం పేదల భూములపై దౌర్జన్యాన్ని ఆపకపోతే ఉద్యమిస్తామన్నారు. త్వరలోనే దళితుల భూముల్లోకి అన్ని దళిత సంఘాలతో పర్యటిస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కేఎన్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ముప్పిడి కుమార్, బాధితులు దూలపల్లి సుజాత,పెద్దపాటి శ్రీనివాస్, దూలపల్లి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.