పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జులై 18 :
మేధాశక్తికి పదును పెట్టి ఆడే చదరంగం క్రీడతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వైకాపా యువ నాయకులు కొట్టు విశాల్ అన్నారు. స్థానిక డి ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో మాస్టర్స్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం మండల స్థాయి అండర్ 16 చెస్ టోర్నమెంట్ ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవితంలో మరచిపోలేని క్రీడ చదరంగం అన్నారు. పిల్లల్లో క్రమశిక్షణ, చురుకుతనాన్ని ఈ క్రీడ పెంచుతుంది అన్నారు. మేధాశక్తిని ఉపయోగించి ఆడే చదరంగం క్రీడతో పిల్లల్లో తెలివితేటలు పెరుగుతాయి అన్నారు. బాల్యం నుంచి ఈ క్రీడను అభ్యసిస్తే ఎత్తుకు పై ఎత్తు వేసి జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలనేది అలవాటు అవుతుందన్నారు. పిల్లలకు చదువులో కూడా మెరుగైన ఫలితాలు సాధించడానికి చదరంగం క్రీడ పరిజ్ఞానం దోహదపడుతుందన్నారు. 24 గంటలు సెల్ ఫోను,ఇంటర్నెట్ ఉపయోగిస్తూ అనవసరమైన వాటి జోలికి వెళ్లకుండా పిల్లలకు బాల్యం నుంచి చదరంగం క్రీడ నేర్పితే ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వగలుగుతామన్నారు. ఇంటిల్లిపాది అవసరాలు తీరుస్తూ మహిళ ఎంతో గురుతరమైన బాధ్యత నెరవేరుస్తుందన్నారు. పిల్లలను తీర్చిదిద్దడంలో తండ్రి కంటే తల్లి పాత్ర అమూల్యమైనదన్నారు. ఇటువంటి టోర్నమెంటుల ద్వారా జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ క్రీడలను, క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నారు అన్నారు. క్రీడలను ప్రోత్సహిస్తున్న మహేంద్ర వర్మను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఈ టోర్నమెంట్ కు సహాయ సహకారాలు అందిస్తున్న వారికి కొట్టు విశాల్ ధన్యవాదాలు తెలియజేశారు. మాస్టర్స్ చెస్ అకాడమీ చైర్మన్ సి హెచ్ ఏ ఆర్ కే వర్మ మాట్లాడుతూ తమ క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. మేధస్సును పెంచడానికి చదరంగం క్రీడ దోహదపడుతుందన్నారు. విజయ సోపానాలు చేరుకోవడానికి అవసరమైన ఆలోచనను, మేధాశక్తిని ఈ క్రీడ అందిస్తుందన్నారు. చీఫ్ ఆర్బిటర్ జీవి కుమార్ మాట్లాడుతూ ఇక్కడ టోర్నమెంటులో తొలి మూడు స్థానాలు సాధించిన వారు ఈనెల 22,23 తేదీల్లో భీమవరంలో జరిగే టోర్నమెంట్ కు ఎంపిక అవుతారన్నారు. అక్కడినుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారన్నారు. మాస్టర్స్ చెస్ అకాడమీ కార్యదర్శి చంద్రశేఖర్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు గిరిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చదరంగం పోటీలను కొట్టు విశాల్ ప్రారంభించారు. వర్మ, విశాల్ మధ్య ఆసక్తికరమైన ఆట సాగింది. పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన చిన్నారులు వీరు ఇరువురు వైపు ఆటలో చేతులు కలపడం విశేషం.