Headlines

పెద్దిరెడ్డికి పెద్ద కష్టమే!

పెద్దిరెడ్డికి పెద్ద కష్టమే!
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెద్ద కష్టమే వచ్చి పడింది. మహామహులనే ముప్పు తిప్పలు పెట్టే చాతుర్యం, హీరోలను జీరోలు చేసే.. జీరోలను హీరోలు చేసే నైపుణ్యం ఆయన సొంతం. ఇప్పటిదాకా ఆయనకు ఎదురుపడి పోరాడటానికి ఎవరూ సాహసించలేదు. అబ్బో.. పెద్దిరెడ్డా.. అంటూ తప్పుకుపోయారు తప్ప, ఢీ అంటే ఢీ అనే వారెవరూ లేరు. ఇప్పటికిప్పుడు ఆయన్ను ఆందోళనకు గురిచేసే వారెవరూ లేరనుకుంటున్న సమయంలో పుంగనూరులో ఆయన ప్రత్యర్థిగా పోటీ చేసిన బోడె రామచంద్రయాదవ్‌ ఏకు మేకై కూర్చున్నారు.

గత ఎన్నికల్లో పుంగనూరులో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన రామచంద్ర యాదవ్‌ను పెద్దిరెడ్డి వర్గీయులు ముప్పు తిప్పలు పెట్టారు. ఎన్నికలు అయిపోయాక కూడా వదల్లేదు. ఆయన ఏ పని చేసినా, అడ్డుకోవడమే ఎజెండాగా పెట్టుకున్నారు. ఓ దశలో ప్రజలకు సహాయక కార్యక్రమాలు నిర్వహించడం కూడా తప్పన్నట్లు వ్యవహరించారు. ఆయన ఇంటిపై కూడా దాడి చేశారు. తమ జోలికి వస్తే ఎవరికైనా ఇదేగతి పడుతుందనేలా హెచ్చరికలు పంపారు. ఆ సమయంలో రామచంద్ర యాదవ్‌ పక్కన నిలుచునేందుకు ఎవరూ పెద్దగా ముందుకు రాలేదు. దీంతో ఆయన కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలనేలా రాజకీయ వ్యూహానికి పదునుపెట్టారు. రామ్‌దేవ్‌ బాబాతో తనకున్న సాన్నిహిత్యం, ఇతరత్రా పలుకుబడితో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఇతర పెద్దలతో పరిచయం పెంచుకోవడం.. ఆ తర్వాత ఏకంగా బీసీవైపీ (భారత చైతన్య యువజన పార్టీ)ని స్థాపించడం చకచకా జరిగిపోయింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదిగిన క్రమం గురించి దాదాపుగా అంతా తెలిసిన వారిలో యాదవ్‌ ఒకరు. అందువల్ల అక్కడి నుంచే సరికొత్త రాజకీయం ప్రారంభించారు. అనతి కాలంలో పెద్దిరెడ్డి వేల కోట్ల సమ్రాజ్యానికి ఏ విధంగా అధిపతి అయ్యారో క్షుణ్ణంగా ఆరా తీశారు. చాలా వరకు ఆధారాలూ సంపాదించారు. వాటన్నింటినీ తీసుకెళ్లి ఇటీవల ఢిల్లీలో కేంద హోం మంత్రి అమిత్‌షా ముందు పెట్టారు. దాదాపు 40 వేల కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా ఆర్జించారని వివరించారు. బయటకు కనిపించకుండా బినామీ పేర్లతో ఆస్తులు ఇంకా ఉన్నాయని, ఈడీ దర్యాప్తు జరిపిస్తే వాటి బండారం బట్టబయలవుతుందని వివరించారు. ఆ చిట్టాలోని వివరాలు చూసి అమిత్‌షా ఆశ్చర్యపోయారట! ఆసక్తిగా పరిశీలించి, కొన్ని సందేహాలను నివృత్తి చేసుకున్నారట. రామచంద్రయాదవ్‌ హోం మంత్రికి ఇచ్చిన ఫిర్యాదు పత్రంలో ఉన్న అంశాల్లో కొన్ని ఇలా..

– మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో పీఎల్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 13 ఏళ్లుగా పని చేస్తోంది. 2019 ఎన్నికల ముందు వరకు ఈ కంపెనీ టర్నోవర్‌ రూ.731 కోట్లు మాత్రమే. ఆ తర్వాత మూడేళ్లలో రూ.1,285 కోట్లకు చేరింది. ఈ నాలుగేళ్లలోనే ఆస్తులు రూ.595 కోట్ల నుంచి 1,472 కోట్లకు పెరిగాయి. ఈ మొత్తం వ్యవహారంలో బయటకు కనిపించకుండా రూ.35–40 వేల కోట్ల కుంభకోణం దాగి ఉంది.
– పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల పేరుతో 61 కంపెనీలు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా కేవలం 17 మంది డైరెక్టర్ల చేతుల్లో నడుస్తుండటం ఆశ్చర్యకరం. ఈ కంపెనీలన్నీ మరో 50 కంపెనీలతో అనుసంధానం అయ్యాయి.
– ఈ కంపెనీలు, వ్యక్తుల పేరిట ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో.. తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరంలో విలువైన అపార్ట్‌మెంట్లు, భవనాలు, భూములు ఉన్నాయి.
– ఇసుక, గనుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ భారీగా వీరికి ముడుపులు అందుతున్నాయి. మైన్స్‌ విషయంలో అడ్డగోలు లీజులు, మైన్స్‌లో అనధికార వాటాలు, నెలవారీ మామూళ్ల వసూళ్లకు వందల సంఖ్యలో పెద్దిరెడ్డి మనుషులు పని చేస్తున్నారంటే వీరి దందాగిరీ ఏ రీతిన సాగుతోందో ఇట్టే తెలుస్తోంది.
– వీరి అడ్డగోలు సంపాదనకు ఎపీఎండీసీ ప్రత్యక్ష ఉదాహరణ. వందలాది మంది ఉద్యోగులను పని లేకున్నా నియమించారు. రూ.కోట్లు దండుకున్నారు. అక్రమ మైనింగ్‌ ద్వారా ప్రతి నెలా రూ.వెయ్యి కోట్లు వీరి జేబుల్లోకి వెళ్తున్నాయి.
– వైఎస్సార్‌ జిల్లాలో బెరైటీస్‌ను సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) కళ్లు గప్పి మరీ అనధికారికంగా తరలించడం ద్వారా రూ.వందల కోట్లు వెనకేసుకుంటున్నారు. ఇటీవల ఈ అవకతవకల్లో కొన్ని బయట పడటంతో ఇతరులకు దొరక్కుండా వాటిని సరిచేయించేందుకు కిందా మీదా పడుతున్నారు.
– గత ప్రభుత్వ హయాంలో లీజులు పొందిన వారిని ఇబ్బందులకు గురి చేయడం ద్వారా రూ. వేల కోట్లు ఆర్జించారు. మాట వినని వారి లీజులు కుంటి సాకులతో రద్దు చేశారు. 50–50, 70–30 శాతం వాటాలతో చెలరేగిపోతున్నారు. చివరకు గ్రానైట్‌ వేస్ట్‌ను కూడా ఇతర వ్యాపారులకు వదలడం లేదంటే వీరి దందా ఏ రీతిన సాగుతోందో చెప్పాల్సిన పనిలేదు.

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ చేయలేని పనిని రామచంద్ర యాదవ్‌ చేయగలిగారని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కూడా రాజకీయ ఆరోపణలు తప్పించి, ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా ప్రజల ముందు పెట్టలేకపోయారు. పైగా మొన్న రామచంద్రయాదవ్‌ కేంద్ర హోం మంత్రికి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ నేతతో ప్రెస్‌మీట్‌ పెట్టించడం గమనార్హం.

ఏమీ లేకుండానే ఎవరినైనా ఇబ్బంది పెట్టడంలో దిట్ట అయిన అమిత్‌షా చేతికి పెద్దిరెడ్డికి సంబంధించిన అక్రమాల చిట్టా దొరికితే ఇక ఊరుకుంటారా.. అని రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. నిజంగా ఈడీ దర్యాప్తునకు ఆదేశిస్తే గనుక పెద్దిరెడ్డికి ఇక నిద్రలేని రాత్రులేనని విశ్లేషకులు చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీతో బీజేపీ సంబంధాలు ఇప్పుడున్నట్లు ఉంటే పరవాలేదని, ఏమైనా తేడా వస్తే మాత్రం పెద్దరెడ్డికి పెద్దకష్టం తప్పదంటున్నారు. రాష్ట్రంలోని 64 నియోజకవర్గాల్లో వారు చెప్పిందే వేదంగా సాగుతున్న ప్రస్తుత తరుణంలో మొట్టమొదటిసారిగా వారికి రామచంద్ర యాదవ్‌ ఝలక్‌ ఇచ్చారని వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో కూడా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మెనార్టీల్లోని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీడీపీకి వెళ్లకుండా బీసీవైపీని పెట్టించిందే పెద్దిరెడ్డి అని ఆయన ముఖ్య అనుచరులు కొందరు చెబుతుండటం కొసమెరుపు.