కొత్త స్ట్రాటజీ వర్కవుట్ …. వైసీపీ కంచుకోటలోకి చంద్రబాబు..

పడిన చోటే నిలబడాలన్న సూత్రం చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం అలానే సాగింది. దారిపొడవునా వివాదాలు, సంక్షోభాలు ఎదురయ్యాయి. అటు పదవులు, ఉన్నత కొలువులు కూడా సాధ్యమయ్యాయి. సంక్షోభాలకు ఆయన కుమిలిపోలేదు. పదవులు, కొలువులకు పరవశించిపోలేదు. అయితే జీవితంలో ఎన్నో ఎత్తూపల్లాలు చూసిన ఆయనకు వైసీపీ ప్రభుత్వంలో ఎదురైన పరాభావాలు అన్నీఇన్నీ కావు. కుటుంబసభ్యులపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలతో ఆయన చిన్నబుచ్చుకున్నారు. చివరకు ఏడు పదుల వయసులో కన్నీటిపర్యంతమయ్యారు. శాసనసభకు వస్తే గిస్తే సీఎం హోదాలో మాత్రమే వస్తానని ప్రతినబూనారు. అయితే ఆ శపధం ఆయన మనసులో ఉన్నట్టుంది.

అందుకే టీడీపీని అధికారంలోకి తీసుకురావాలన్న కసితో పనిచేస్తున్నారు. వయసును లెక్క చేయకుండా పర్యటనలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ కంచుకోట అయిన కర్నూలు జిల్లాలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. Chandrababu- JAGAN వైసీపీ ఆవిర్భావం నుంచి కర్నూలు ఆ పార్టీకి అండగా నిలుస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు లోక్ సభ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. అయితే గతం కంటే వైసీపీ ప్రభ తగ్గిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే జగన్ సర్కారు మూడు రాజధానులు ప్రకటించింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేయాలని సంకల్పించింది. అయితే ఈ నిర్ణయంపై పెద్దగా హర్షాతిరేకాలు వ్యక్తం కాలేదు. అలాగని వ్యతిరేకత లేదు.

కానీ రాష్ట్రం మధ్యన ఉన్న రాజధానిని విశాఖ తరలించడంపై మాత్రం మెజార్టీ ప్రజలు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటిస్తుండడం మాత్రం హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా యువత, విద్యార్థులను టార్గెట్ చేసుకుంటారని ప్రచారం సాగుతోంది. అటు స్పెషల్ స్టేటస్ లేదు. పరిశ్రమలులేవు. కొత్త నొటిఫికేషన్లు లేవు. వీటిపైనే చంద్రబాబు ప్రసంగించనున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. త్వరలో లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. కార్యక్రమ నిర్వహణ ఖరారు చేయడంతో పాటు కర్నూలు జిల్లాలో రాజకీయ పరిస్థితులను చంద్రబాబు తెలుసుకోనున్నారు. కొన్ని అసెంబ్లీ స్థానాలకైనా అభ్యర్థులను ఖరారు చేయాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు సమాచారం.

మరోవైపు జనసేనతో పొత్తుల వ్యవహారం ఇంకా ఊహాగానాల్లో ఉంది. ప్రధాని మోదీతో భేటీ తరువాత పవన్ వ్యూహంలో పక్కాగా మార్పు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కర్నూలు పర్యటనలో చంద్రబాబు దీనిపై మాట్లాడేఅవకాశమున్నట్టు తెలుస్తోంది. Chandrababu- JAGAN మూడు రోజులపాటు కర్నూలు జిల్లాలో చంద్రబాబు బిజిబిజీగా గడపనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి కర్నూలు చేరుకుంటారు. పత్తికొండ ఎన్టీఆర్ సర్కిల్ లో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు. రాత్రికి ఆదోనిలో బస చేస్తారు. గురువారం ఉదయం రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం ఎమ్మిగనూరులోని బహిరంగసభలో మాట్లాడతారు. అక్కడే రాత్రి బస చేస్తారు. 18న టీడీపీ కార్యాలయానికి వెళ్లి జిల్లా నేతలతో సమీక్షిస్తారు. కీలక విషయాలపై చర్చించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.