ఎమ్మెల్సీ కవితపై హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేయాలని డీకే అరుణ డిమాండ్

నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఇంటిపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతల దాడిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఖండించారు. టీఆర్‌ఎస్‌ గూండాలు ఇలా దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎంపీ అరవింద్‌ కుటుంబానికి టీఆర్‌ఎస్‌ నుంచి ప్రాణహాని ఉందని డీకే అరుణ అన్నారు. దాడికి కారణమైన ఎమ్మెల్సీ కవితపై హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేసారు.

టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఇంటిపై ఈరోజు ఉదయం దాడి చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని అరవింద్‌ నివాసాన్ని ముట్టడించి.. ఇంటి అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసారు. ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండీలను ధ్వంసం చేయడమే కాకుండా.. అరవింద్‌ దిష్టిబొమ్మను కూడా దహనం చేశాయి. అంతేకాదు ఎంపీ అరవింద్‌ అమ్మగారిని, ఇంట్లోని మహిళా సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేసారు. ఈ దాడి నేపథ్యంలో డీకే అరుణ స్పందించారు.

‘బీజేపీ కార్యకర్తలు ధర్నా ఆలోచన చేస్తేనే.. తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు. మరి ఇప్పుడు ఏకంగా దాడి జరిగింది. పోలీసులు ఏ కేసులు నమోదు చేస్తారు?. దాడికి కారణమైన ఎమ్మెల్సీ కవితపై పోలీసులు కేసు నమోదు చేయాలి. ఎంపీ అరవింద్‌ కుటుంబానికి టీఆర్‌ఎస్‌ నుంచి ప్రాణహాని ఉంది. ఇంట్లో ఎంపీ లేరని తెలిసి కూడా ఈవిధంగా దాడికి పాల్పడటం ఏంటి. ఇది దేనికి సంకేతం?’ అని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.