అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు అల్లాడుతున్న వరి రైతులకు ధాన్యం ఆరబోసేందుకు ఉపాధి కూలీలతో సాహయం అందించాలని, అధికారులను ప్రాధేయపడి అడుగుతున్నామని ఆలమూరు మండలం జొన్నాడ పిఎసిఎస్ చైర్మన్ తాడి మెహర్ ఆదిత్య రెడ్డి అన్నారు. గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆలమూరు మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో దాన్యం రోడ్లపైనే రాసులుగా పోశారని, వాటిని ఆడబెట్టేందుకు రైతుల అభ్యర్థన మేరకు బరకాలు ఏర్పాటుచేసి ఉపాధి కూలీలతో సహాయం అందించాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉపాధి కూలీలకు పని లేక ఖాళీగా ఉన్నారని, వారికి ఇలా చేయటం వల్ల ప్రభుత్వం ఉపాధి కల్పించడంతో పాటు అన్నదాతలను ఆదుకుంటున్నట్లు అవుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే రాశులుగా ఉన్న ధాన్యం కొన్ని గ్రామాల్లో మొలకెత్తగా మరికొన్ని గ్రామాల్లో మొలకెత్తడానికి సిద్ధంగా ఉందని ఇలాంటి కష్టకాలంలో ప్రతి అధికారి రైతులకు తమ సహాయ సహకారాలు అందించాలని అన్నారు. స్థానిక తాసిల్దార్, ఎంపీడీవో, వ్యవసాయ శాఖ అధికారులు తక్షణం స్పందించి రైతులకు ఉపాధి కూలీలను ఏర్పాటు చేసి అన్నదాతలను కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.