పొంగులేటి డిమాండ్లు: వారికి 17సీట్లు; తలాడించేసిన హస్తం అధినాయకత్వం!!

బీఆర్ఎస్ బహిష్కృత నేత, ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ మామూలుగా లేదు.బీఆర్ఎస్ పార్టీ నుండి ఆయనను బహిష్కరించినప్పటి నుండి ఆయనను మా పార్టీ లోకి రండి అంటూ ముఖ్య పార్టీల నేతలు పోటీ పడ్డారు.

అనేక రోజుల తాత్సారం తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి సుముఖతను వ్యక్తం చేశారు.

ఖమ్మం జిల్లాలో అంగబలం, అర్థబలం ఉన్న నేత అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఖమ్మంలో వచ్చే ఎన్నికలలో లబ్ధి చేకూరుతుందని రాజకీయ వర్గాలు భావించాయి. తాను పోటీ చేసిన స్థానం మాత్రమే కాకుండా, ఖమ్మం జిల్లాలో, పక్క జిల్లాల్లోనూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభావం ఉంటుందని బిజెపి, కాంగ్రెస్ ప్రధానంగా విశ్వసించాయి.

ఈ క్రమంలోనే ఆయనను పార్టీలోకి ఆహ్వానించాలని పోటీపడడం పొంగులేటి డిమాండ్ ను బాగా పెంచింది. ఫలితంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నా పార్టీ అధిష్టానం ముందు బోలెడు డిమాండ్లు పెట్టే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ లో చేరేందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ముందు కొన్ని కీలక ప్రతిపాదనలు పెట్టారు.

ఈ ప్రతిపాదనలలో కీలకంగా పార్టీలో చేరాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన అనుచరులు 17 మందికి సీట్లు ఇవ్వాలని కోరినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. దీనికి కాంగ్రెస్ అధిష్టానం ఓకే కూడా చెప్పిందని సమాచారం. ఇక పొంగులేటి డిమాండ్ లకు కాంగ్రెస్ తలాడించడంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

డీజే టిల్లు సాంగ్ కు స్టెప్పులేసి దుమ్ము రేపిన మంత్రి మల్లారెడ్డి!!

పొంగులేటి అటు బీజేపీని కాదని, కాంగ్రెస్ లోకి వస్తున్న వేళ ఆయన డిమాండ్స్ ను కాదనలేని పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానానిది. ఏదేమైనా తాజా పరిణామాలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ ను జాతీయ పార్టీ నేతలే అమాంతం పెంచేశారు అన్న చర్చ జరుగుతుంది. ఫలితంగా ఆయన ఏది అడిగినా నో చెప్పలేని స్థితిలో కాంగ్రెస్ పడింది.