ఏపీలో బంగారం పంట పండనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారం తవ్వకాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసి లిమిటెడ్ సిద్ధమవుతోంది. ఏపీలోని బంగారు గనుల తవ్వకాల వైపు వడివడిగా అడుగులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది.
ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎండిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో బంగారం గని కోసం వేగంగా చర్యలు చేపడుతోంది.
అందులో భాగంగా మొదటి విడతలో దీనిపై ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలోని చిగర్ గుంట, బిసనత్తమ్ బంగారం గనిలో 18 లక్షల టన్నుల బంగారం ఖనిజం ఉన్నట్లు ఎన్ఎండిసి అంచనా వేసింది. ఒక్కో టన్ను ఖనిజం నుంచి ఐదు గ్రామాలకు పైగానే బంగారం లభిస్తుందని ఎన్ఎండిసి లిమిటెడ్ భావిస్తుంది.
ఈ బంగారం గనుల తవ్వకాలు నిర్వహించడానికి ఆసక్తి తో ముందుకు వచ్చిన ఎన్ఎండీసీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు చేసింది. ఆపై రాష్ట్రప్రభుత్వం నుంచి మైనింగ్ లీజ్ తీసుకుని, పర్యావరణ అనుమతి సాధించి, ఇతరత్రా అనుమతులన్నీ కూడా తీసుకొని రెండేళ్లలో తవ్వకాలు ప్రారంభించాలని భావిస్తుంది. ఈ మొత్తం అనుమతుల ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి ఒక కన్సల్టింగ్ సంస్థ ఎంపిక చేస్తారని తెలుస్తుంది.
ఇప్పటికే అనేక చోట్ల అనేక పనులను నిర్వహిస్తున్న ఎన్ఎండిసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వజ్రాల గని నిర్వహిస్తోంది చత్తీస్గఢ్ కర్ణాటక రాష్ట్రాలలో ఎన్నో సంవత్సరాలుగా ఇనుప ఖనిజాన్ని తవ్వి తీస్తోంది. తాజాగా బంగారం తవ్వకాల పై ఆసక్తిని చూపిస్తున్న ఎన్ఎండీసీ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో బంగారం గనుల తవ్వకం తో దీనికి శ్రీకారం చుట్టనుంది.