Headlines

తొలగించిన ప్రతి ఓటు డాక్యుమెంటును నూరు శాతం క్రాస్ వెరిఫికేషన్ చేయాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి

 

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం: సెప్టెంబర్ 7 :

తొలగించిన ప్రతి ఓటు డాక్యుమెంటును నూరు శాతం క్రాస్ వెరిఫికేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో సమావేశమై తొలగించిన ఓట్లు పునః పరిశీలనపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రీవెరిఫికేషన్ ప్రక్రియను బాధ్యతాయుతంగా చేపట్టాలన్నారు. ఎన్నికల కమీషన్ సూచనల మేరకు జనవరి 6, 2022 తేదీ నుంచి ఆగస్టు 9, 2023వ తేదీ వరకు వచ్చిన తొలిగింపులను నియోజకవర్గాల ఇఆర్వోలు నూరు శాతం క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. నియోజకవర్గానికి నియమించిన ప్రత్యేక అధికారులు ఇఆర్వోలు చేపట్టిన ఓటర్లు తొలగింపు పరిశీలనను తిరిగి పునఃపరిశీలించాలని ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రతి నియోజకవర్గం క్లైములు పరిశీలన చేయడానికి సంబంధిత ఫైల్స్ సిద్ధంగా ఉంచాలన్నారు. జనవరి 6, 2022 నుండి జరిగిన అన్ని తొలగింపులను తిరిగి ధృవీకరించడం, తద్వారా అటువంటి తొలగింపులన్నీ సరైన డాక్యుమెంటేషన్‌తో ఎన్నికల కమిషన్ సూచించిన విధానం ప్రకారం జరిగాయని తిరిగి ధృవీకరించాల్సి వుందన్నారు. బిఎల్వోలు అన్ని తొలగింపులను 100% ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలన్నారు. ఇఆర్వోలు అన్ని ఫైల్‌లు / డాక్యుమెంట్‌లను 100% క్రాస్ వెరిఫికేషన్ చేయాలని, కనీసం 1000 ఎంట్రీలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరికి ఓటు హక్కు తొలగించరాదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా రీవెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలంతా ఉపయోగించుకుని వారి ఓటు ఎక్కడుంది, ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది, కుటుంబ సభ్యులందరికీ ఒకే పోలీస్ స్టేషన్లో ఓటు హక్కు ఉందా లేదా చెక్ చేసుకోవాలని, ఏవైనా మార్పులు ఉంటే చేసుకోవాలని సూచించారు. రీవెరిఫికేషన్ ప్రక్రియను ఈఆర్వోలు ఏఈఆర్వోలు, బిఎల్ఓల ద్వారా మానిటర్ చేస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా స్పెషల్ సమ్మర్ రివిజన్ – 2024లో భాగంగా జిల్లాలో ప్రతి నియోజకవర్గం, ప్రతి పోలీస్ స్టేషన్ వారిగా రీవెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతున్నామన్నారు. ఆగస్టులో ఇంటింటికి సర్వే పూర్తి చేసుకున్నామని, కొత్తగా ఎవరైతే 18 సంవత్సరాలు నిండాయో వారికి మొదటిసారి ఓటు హక్కు కల్పించడం, ఇంకా ఎక్కడైనా మిస్ అయి ఉండి అర్హత ఉన్నవారు ఎక్కడైనా ఓటర్ నమోదు కాకపోయి ఉంటే వాళ్లందరినీ గుర్తించి బిఎల్వోలు ఇంటింటికి తిరిగి ఈ ప్రక్రియ గురించి వివరంగా తెలియజేయాలన్నారు. వారి వద్ద నుంచి ఫామ్-6 క్లెయిమ్స్ తీసుకోవడం, ఎక్కడైనా చనిపోయిన, షిఫ్ట్ అయినా ఓటర్లు వారి వివరాలను ఫామ్-7లో తీసుకొని పూర్తి పరిశీలన చేసి చనిపోయిన వారి ఓటు తొలగించడం, శాశ్వతంగా మైగ్రేట్, షిఫ్ట్ అయిన వారి వివరాలు, మార్పులు, సవరణలు ఫామ్-8 తీసుకుని చేసే ప్రక్రియలను పూర్తి చేయడం జరిగిందన్నారు. బిఎల్వోలు ఇంటింటికి వెళ్లి మొత్తం ఓటర్ జాబితాను మరోసారి పరిశీలన చేసి క్లెయిమ్స్ తీసుకోవడం జరిగిందని, ఆ క్లెయిమ్స్ పరిశీలన చేసి ఈఆర్వోలు వారి లాగిన్ ల నుంచి పరిశీలన చేసి వాటన్నిటిని అప్రూవల్ చేసి వెంటనే డిస్పోస్ చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు తాడేపల్లిగూడెం డిఆర్ఓ కే.కృష్ణవేణి, ఆచంట టూరిజం ఆర్ జె డి స్వామి నాయుడు, పాలకొల్లు డి సి ఓ ఎం రవికుమార్, నరసాపురం డి ఐ ఓ వి.ఆదిశేషు, ఉండి జిల్లా సర్వే అధికారి కే జాషువా, తణుకు జెడ్పి సీఈవో కె వి ఎస్ ఆర్ రవికుమార్, ఎలక్షన్ సూపరింటెండెంట్ ఎల్.నరసింహారావు, డిటి సన్యాసిరావు పాల్గొన్నారు.