Headlines

ఆరోగ్య సురక్ష శిభిరాలకు వైద్యుల సహకారం ఎంతో అవసరం: జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి

ఆరోగ్య సురక్ష శిభిరాలకు వైద్యుల సహకారం ఎంతో అవసరం: జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం: అక్టోబర్ 4 :

ఆరోగ్య సురక్ష శిభిరాలకు వైద్యుల సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు.

బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆరోగ్య సురక్ష క్యాంపుల నిర్వహణ, సేవలుపై ఐఎంఎ ప్రతినిధులు, వైద్య శాఖ అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య శిభిరాలకు ప్రత్యేక వైద్య నిపుణుల సహకారం ఎంతైనా అవసరం అన్నారు. ఈ విషయమై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించి వైద్యులను సమకూర్చాలని కోరారు. సెప్టెంబర్ 30న జిల్లాలో జగనన్న ఆరోగ్య శిబిరాలు ప్రారంభించి వైద్య సహాయం అందించడం జరుగుచున్నదన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎం, ఆశా వర్కర్, వాలంటీర్లు తాము జరిపిన సర్వే ప్రకారం వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిని జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు తరలించి వారందరికీ చికిత్స అందించేలా మరింత కృషి చేయాలన్నారు. ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా గ్రామాల్లో వైద్య సేవలు అందించి ఆరోగ్యకర సమాజానికి కృషి చేస్తుందని వైద్యాధికారులు, సిబ్బంది ఎంతో బాధ్యతగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. క్రానికల్ డిసీజ్ కేసులు గుర్తించారా? ఎక్కువగా ఏ ఏ జబ్బులతో రోగులు శిబిరానికి వస్తున్నారని వైద్యులను ప్రశ్నించగా సీజనల్ వ్యాధుల పైన అధికంగా కేసులు నమోదు అవుతున్నాయని వారు కలెక్టర్ కు తెలిపారు. ఇంటింటికీ వాలంటీర్లు, ఏ ఎన్ ఎం ల ఆరోగ్య సర్వే తో పాటు గ్రామ సచివాలయ పరిధిలోని సిడి ఎన్సిడి సర్వే జాబితా వివరాలు ఆధారంగా రోగులను గుర్తించి ఏ ఒక్కరూ వైద్యానికి దూరం కాకుండా మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆరోగ్య శ్రీ క్రింద అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న ఆసుపత్రుల పై శిబిరానికి వచ్చే రోగులకు అవగాహన కల్పించాలని సూచించారు. శిబిరానికి వచ్చే వారికి అవసరమైన ఆరోగ్య చికిత్సలతో పాటు మనోధైర్యాన్ని నింపాలన్నారు. అనారోగ్యంతో అధిక డబ్బులు ఖర్చుపెట్టి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకూడదన్న ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గ్రామాల్లో నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం హెచ్ ఓ డాక్టర్ డి.మహేశ్వరరావు, అడిషనల్ డిఎం హెచ్ ఓ డాక్టర్ భాను నాయక్, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ కీర్తి, భీమవరం పాలకొల్లు ఆకివీడు నరసాపురం ఐఎంఎ ప్రతినిధిలు, తదితరులు పాల్గొన్నారు.