Headlines

పత్రికా రంగానికి వానపల్లి..సేవలు చిరస్మరణీయం..! ప్రథమవర్ధంతి సభలో వక్తల నివాళి!

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, డిసెంబర్ 1:

 

నాలుగు దశాబ్దాల పాటు వివిధ పత్రికల్లో విలేఖరిగా సేవలు అందించిన వానపల్లి సుబ్బారావు సేవలు చిరస్మరణీయమని , ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకునిగా, ఏ.పి.యు.డబ్ల్యు.జే. రాష్ట్ర నాయకునిగా జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేసారని, పలువురు వక్తలు ఘనంగా నివాళులు అర్పించారు.

సీనియర్ పాత్రికేయుడు వానపల్లి సుబ్బారావు ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఏ .పి.యు.డబ్ల్యు.జే. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం కపర్థీ భవన్ లో అధ్యక్షుడు తమ్మిసెట్టీ రంగసురేష్ అధ్యక్షతన జరిగింది. రంగసురేష్ మాట్లాడుతూ

వివిధ పత్రికల్లో విలేఖరిగా, సుదీర్ఘకాలం పనిచేసిన వానపల్లి కొత్త తరం పాత్రికేయులకు మార్గదర్శిగా వ్యవహరించేవారని, అందర్నీ అబ్బాయ్ అంటూ చెరదీసేవారని అన్నారు. పాత్రికేయుల సంక్షేమానికి వానపల్లి సుబ్బారావు ఎన్నో సేవలు అందించారని, పెద్దవారిలో పెద్దగా, కుర్రవాళ్ళతో కుర్రవానిగా కలిసిపోయే భోళా మనస్తత్వం సుబ్బారావు సొంతమని పేర్కొన్నారు.

వానపల్లి సుబ్బారావు ఆశయాలను ఆదర్శాలను, నేటితరం పాత్రికేయులు పాటించాలని రంగ సురేష్ కోరారు.

 

ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా వానపల్లితో తన ఉద్యమానుబంధం కొనసాగుతూ వచ్చిందని, వృత్తిలో, ఉద్యమంలో, పట్టణంలో పలుసంస్థల కార్యకలాపాల్లో ఇద్దరం కలిమెలిసి పని చేశామని గుర్తు చేసుకున్నారు. వివిధ వర్గాలనుండి పాత్రికేయులకు బెదిరింపులు వచ్చినా, దౌర్జన్యాలు జరిగినా వానపల్లి నిలదీసేవారని , అలాంటి సందర్భాల్లో పాత్రికేయులం అందరం ఐక్యంగా పోరాడి జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ వచ్చామని సోమసుందర్ గుర్తు చేశారు. యూనియన్ కార్యక్రమాలకు సమావేశాలకు మానకుండా హాజరై సంఘ పటిష్టానికి కృషి చేసారని గుర్తు చేశారు. వృత్తి ప్రమాణాలు , వృత్తి గౌరవం కోసం పాత్రికేయులు కృషి చేయాలని , అదే వానపల్లికి అర్పించే నిజమైన నివాళి కాగలదని ఆయన అన్నారు.

సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చింతకాయల బాబూరావు మాట్లాడుతూ పాత్రికేయ వృత్తికి ,జర్నలిస్టుల సంక్షేమానికి అంకితమై వానపల్లి జీవించారని, ఆయనది నిర్భయంగా, ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు ముఖం మీదనే మాట్లాడే తత్వమని , ఎవరిమీద ఆయన కోపం పెంచుకునే వారు కాదని అన్నారు. యూనియన్ కు సుదీర్ఘకాలం నిబద్దతతో సేవలు అందించారని బాబూరావు నివాళులు అర్పించారు.

ఏ.ఐ.టి.యు.సి. ఏరియా కమిటీ కార్యదర్శి ఓసూరి వీర్రాజు మాట్లాడుతూ పాత్రికేయులకు మంచి చెడ్డలు చెప్పే పెద్దతరం వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. వృత్తిలో వానపల్లి పాటించిన విలువలను నేటితరం కొనసాగించాలని కోరారు.

ప్రెస్ క్లబ్ పూర్వాధ్యక్షుడు చిక్కాల రామకృష్ణ, ప్రెస్ క్లబ్ కార్యదర్శి గొలిమే బుజ్జిబాబు, సీనియర్ పాత్రికేయులు చిట్యాల రాంబాబు, తేతలి గంగాధర రెడ్డి , ఆలమండ వెంకట నరసింహారావు , కోలాటి మోషేబాబు , ఎన్.వెంకటరావు, ఆకుల నవదుర్గా ప్రసాద్, రొక్కాల నాగబుజ్జి , వానపల్లి సుబ్బారావు కుమారుడు వానపల్లి దేవేంద్ర ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ వానపల్లి సుబ్బారావు తో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.

తొలుత వానపల్లి చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చింతకాయల బాబూరావు , పూలమాల వేసి నివాళులు అర్పించారు. పాత్రికేయులు పుష్పాంజలి ఘటించారు.