Headlines

విజయవాడకు సీఎం జగన్…జయహో బీసీ మహాసభ..

బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడలో పర్యటించనున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో నిర్వహించనున్న జయహో బీసీ మహాసభ​ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. 139 బీసీ కులాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఈ సభను తలపెట్టారు. సీఎం షెడ్యూల్… ఉదయం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. 10 గంటలకు సీఎం జగన్ చేతుల మీదుగా సభను ప్రారంభిస్తారు. 10 నుంచి 12 గంటల వరకు బీసీ మంత్రులు, నాయకులు ప్రసంగిస్తారు. 12 నుంచి ఒంటి గంట వరకు సీఎం ప్రసంగం ఉండనుంది. నగరంలో జయహో బీసీ మహాసభ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధింఛారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా వివరాలను వెల్లడించారు. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. బెంజిసర్కిల్‌ నుంచి బందరు రోడ్డులోకి, పోలీస్‌ కంట్రోల్‌ రూం నుంచి బెంజిసర్కిల్‌ వైపు, ఐదో నంబర్‌ రూట్, ఏలూరు రోడ్డులోని సీతారామపురం సిగ్నల్‌ నుంచి ఆర్‌టీఏ జంక్షన్‌ వరకు, శిఖామణి సెంటర్‌ నుంచి బందరు రోడ్డుకు జయహో బీసీ మహా సభకు వచ్చే వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తారు.

ఈ సభ తర్వాత జోనల్, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో ఇదే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తామని వైసీపీ నేతలు వెల్లడించారు. ఈ సభ కోసం వార్డు మెంబర్లు, పంచాయతీ సర్పంచ్‌లు, పీఏసీఎస్‌ అధ్యక్షులు, సభ్యులు, ఇతర నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న 82,432 మంది బీసీలకు ఆహ్వాన పత్రాలను అందించారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఇక సభకు వచ్చే వారికోసం 24 రకాల వంటకాలను సిద్ధం చేయనున్నారు. సభను విజయవంతం చేసేందుకు భారీగా జనాన్ని తరలించనున్నారు వైకాపా శ్రేణులు. సీఎం నెల్లూరు టూర్… జయహో బీసీ మహాసభ ముగిసిన తర్వాత సీఎం జగన్ నెల్లూరు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:25 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. ఈ మేరకు నెల్లూరు రూరల్‌ మండలం కనపర్తిపాడు వీపీఆర్‌ కన్వెన్షన్‌ హాలులో సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 3:55 గంటల నుంచి సాయంత్రం 4:10 గంటల వరకు ఈ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించనున్నారు. సాయంత్రం 6:20 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి ఆయన చేరుకుంటారు.