Headlines

మాజీ జేడీ లక్ష్మినారాయణ కుమార్తె కూడా ఎన్నికల బరిలోకి.!

జనసేన మాజీ నేత, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మినారాయణ, వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేయనున్నారు. లోక్ సభకే ఆయన పోటీ చేస్తారు. విశాఖ నుంచే పోటీ చేస్తానని వీవీ లక్ష్మినారాయణ పలు సందర్భాల్లో ఇప్పటికే స్పష్టతనిచ్చేసిన సంగతి తెలిసిందే. కాగా, జనసేనలోకి తిరిగి ఆయన వెళతారంటూ ప్రచారం జరుగుతుండగా, ఆయన ఈ విషయమై ఇంకా స్పష్టతనివ్వడంలేదు. జనసేన లోకి రావాల్సిందిగా ఆహ్వానం అందిందనీ, ఇతర పార్టీలూ పిలుస్తున్నాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో లక్ష్మానారాయణ చెప్పారు. కుమార్తె కూడా ఎన్నికల బరిలోకి.. వీవీ లక్ష్మినారాయణ ఫౌండేషన్ తరఫున తాజాగా ఓ ప్రకటన వచ్చింది.

లక్ష్మినారాయణ విశాఖ నుంచే పోటీ చేస్తారనీ, ఆయన కుమార్తె కూడా ఎన్నికల బరిలో వుంటారనీ సదరు ఫౌండేషన్ పేర్కొంది. జేడీ ఫౌండేషన్ కన్వీనర్‌గా వున్నారు లక్ష్మినారాయణ కుమార్తె ప్రియాంక. ఆమె విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారట. కాగా, జనసేనలోకి లక్ష్మినారాయణ చేరడం దాదాపు ఖాయమన్న ప్రచారం జరుగుతున్న వేళ, స్వతంత్రంగానే ఆయన పోటీ చేస్తారంటూ జేడీ ఫౌండేషన్ తరఫున ప్రకటన విడుదలవడం గమనార్హం. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు సహా దేశంలో పలు కీలక కేసుల్ని సీబీఐ తరఫున లక్ష్మినారాయణ అప్పట్లో సమర్థవంతంగా డీల్ చేసిన సంగతి తెలిసిందే.