థైరాయిడ్ నియంత్రణలో ఉంచుకునే కొన్ని చిట్కాలు

ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. మనం తీసుకునే ఆహారం, మన జీవన విధానమే ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అలాగే జన్యు పరంగా కూడా ఈ సమస్య తలెత్తుతుంది. మన శరీరంలో గొంతు దగ్గర సీతాకోకచిలుక ఆకారంలో ఈ థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ అనే హార్మోన్ లో వచ్చే హెచ్చు తగ్గుల కారణంగా థైరాయిడ్ సమస్య తలెత్తుతుంది. థైరాయిడ్ సమస్య కారణంగా మన ఇతర అనేక అనారోగ్య సమస్యల బారిన కూడా పడే అవకాశం ఉంది. ఈ థైరాయిడ్ లో కూడా హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అనే రెండు రకాలు ఉన్నాయి. థైరాయిడ్ కారణంగా నీరసం, శరీరంలో శక్తి తగ్గినట్టుగా అనిపించడం, ఆకలి తక్కువగా ఉండడం, మలబద్దకం, చలి ఎక్కవగా అనిపించడం, బరువు పెరగడం లేదా బరువు తగ్గడం, జుట్టు రాలడం, స్త్రీలలో నెలసరిలో మార్పు రావడం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ బారిన పడిన వారు మందులు వేసుకుంటే సరిపోతుంది అనుకుంటే పొరపాటే. మందులను వాడడంతో పాటు సరైన ఆహారాన్ని కూడా తీసుకోవడం చాలా అవసరం. అప్పుడే మనం పూర్తిస్థాయిలో అదుపులో ఉంచుకోవచ్చు. థైరాయిడ్ నియంత్రణలో ఉంచుకునే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Coriander Seeds For Thyroid దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి.

నీళ్లు వేడయ్యాక అందులో ఒక టీ స్పూన్ ధనియాలను వేసి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ధనియాలకు బదులుగా ధనియాల పొడిని లేదా కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. ధనియాల్లో హార్మోన్ల అసమతుల్యతలను తొలగించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో ధనియాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. నీళ్లు బాగా మరిగిన తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో రుచికి కొరకు అర టీ స్పూన్ తేనెను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న ధనియాల కషాయన్ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల హైపో థైరాయిడిజం అదుపులో ఉంటుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల సులభంగా బరువు కూడా తగ్గవచ్చు. అలాగే థైరాయిడ్ వ్యాధి గ్రస్తులు తీసుకోవాల్సిన ఆహారాల్లో అవిసె గింజలు ఒకటి. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో అవిసె గింజలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు ముందుగా ఒక కళాయిలో అవిసె గింజలను వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని గాజు సీసాలో వేసి నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంచుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా నీటిని తాగలేని వారు ఒక టీ స్పూన్ మోతాదులో అవిసె గింజల పొడిని తిని ఆ తరువాత నీటిని తాగాలి. అలాగే అవిసె గింజల పొడిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అదే విధంగా ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు క్యాలీప్లవర్, క్యాబేజి, బ్రకోలి, ముల్లంగి వంటి కూరగాయలను తక్కువగా తీసుకుంటే చాలా మంచిది. అలాగే పాల పదార్థాలను కూడా తక్కువగా తీసుకోవాలి. ఆహారంలో బి విటమిన్స్, ఐరన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల థైరాయిడ్ పూర్తిగా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.