10వ తేదీ దాటినా.. రేషన్, జీతాలు ఇవ్వని కేసీఆర్ : బండి

తెలంగాణ ప్రభుత్వ నిర్వాకం వల్ల.. సంక్రాంతి పండుగ పూట రాష్ట్రంలోని పేదలు పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని… రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. 10వ తేదీ వచ్చినా రాష్ట్రంలోని మూడున్నర కోట్ల మంది ప్రజలకు ఇంకా రేషన్ బియ్యం అందలేదని… కేంద్ర ప్రభుత్వం తన కోటాను సమయానికి విడుదల చేస్తున్నా… రాష్ట్ర సర్కార్ తాత్సారం చేస్తోందని విమర్శించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కి బహిరంగ లేఖ రాసిన బండి సంజయ్.. కొన్ని జిల్లాల్లో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు నిధులు నేటికీ అందకపోవడం దురదృష్టకరమన్నారు. పండుగ పూట ప్రజలని ఇబ్బంది పెట్టవద్దని… తక్షణమే జీతాలు, ప్రజలకు రేషన్ అందించాలని డిమాండ్ చేశారు. దేశంలోని పేద ప్రజలందరికీ మూడు పూటలా ఆహారం అందించాలనే సంకల్పంతో…

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రేషన్‌ కార్డులున్న పేదలందరికీ ప్రతినెలా 5 కిలోల బియ్యాన్ని ఈ ఏడాది పొడవునా ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకుందని బండి సంజయ్ పేర్కొన్నారు. అందులో భాగంగా జాతీయ ఆహార భద్రత చట్టం కింద తెలంగాణలోని సుమారు 55 లక్షలు కార్డుదారులకు గాను.. 1 కోటి 92 లక్షల మంది లబ్ధిదారులకు సుమారు రూ.4,300 కోట్ల విలువైన 13 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని జనవరి 1 నుంచి ఉచితంగా అందిస్తోందని చెప్పారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.250 కోట్లకుపైగా ఆదా అవుతోందని…. ఆ సొమ్ముతో రాష్ట్రంలోని 90 లక్షల రేషన్‌ కార్డుదారులందరికీ (2.83 కోట్ల మంది ప్రజలకు) ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసినా ఇంకా రూ.80 కోట్లకుపైగా రాష్ట్ర ఖజానాకు మిగులుతుందని వివరించారు. పేదల కోసం కేంద్రం ఇస్తోన్న రేషన్ ని.. ఇప్పటి వరకు ప్రజలకు అందించకపోవడం దారుణమని… ఇది క్షమించరాని నేరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో…. పండుగ పూట పేదలు పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.