Headlines

సెమీ కండక్టర్ల తయారి హబ్ గా భారత్..

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, మార్చి 13:

సెమీ కండక్టర్ల తయారీ విభాగంలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తుందని బిట్ సిలికా (హైదరాబాద్) మేనేజర్ డాక్టర్ ఎం.నాగ సీతారాం తెలిపారు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్ర ప్రదేశ్ (ఏపీ నిట్)లో వికసిత భారత్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సెమీ కండక్టర్ పరిశ్రమల్లో ఉన్న అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధి సీతారామ్ మాట్లాడుతూ దేశ ఆర్థికాభివృద్ధికి పెట్టుబడులే కీలకమని చెప్పారు. సెమీ కండక్టర్ల ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమలు భారతదేశంలో తగినన్ని లేకపోవడంతో వాటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని తెలిపారు. భారతదేశంలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీలు ముందుకొస్తున్నాయని, భవిష్యత్తులో భారత్ సెమీ కండక్టర్ల తయారీ హబ్ గా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ధరలు తగ్గటంతోపాటు ఎంతోమందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. సెమీ కండక్టర్లను కంప్యూటర్ పరికరాలు, కంజుమర్ ఎలక్ట్రానిక్స్, వాషింగ్ మిషన్లు, పవర్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఆఫ్ మొబైల్ ట్రాన్స్ ఫోర్ట్, మెడికల్ డివైస్ , ఏరో స్పేస్ డిఫెన్స్ లలో సెమి కండక్టర్లను విరివిగా వినియోగిస్తున్నారన్నారని చెప్పారు.
కమ్యూనికేషన్, ఎంబెడెడ్, చిప్ డిజైన్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు, వాటిని ఎలా సాధించాలి, బీటెక్ లో ఉండగానే స్కిల్స్ ను ఎలా పెంపొందించుకోవాలి అనే విషయాలపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ముందుగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ (గుజరాత్, అస్సాం) ప్రారంభించిన ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కార్యక్రమాన్ని వర్చువల్ పద్దతిలో ఆచార్యులు తిలకించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి, డీన్ లు డాక్టర్ జి.ఆర్.కె శాస్త్రి, డాక్టర్ టి.కురుమయ్య,డాక్టర్ ఎన్.జయరామ్, డాక్టర్ జీబి వీరేష్ కుమార్, ఆచార్యులు వి.సందీప్, డాక్టర్ శ్రీఫణీకృష్ణ కర్రి, డాక్టర్ యువరాజు, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు.