Headlines

అరేబియా సముద్రంలో తుఫాన్.. ఆ రాష్ట్రాలకు వర్షసూచన..!

ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరం దిశగా పయనించి రానున్న 12 గంటల్లో అరేబియా సముద్రానికి తూర్పు మధ్య, ఆనుకుని ఆగ్నేయంగా తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం తెలిపింది.

ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ఏర్పడిన వాయుగుండం నిన్న సాయంత్రం 5.30 గంటలకు అల్పపీడనంగా మారిందని తెలిపింది. ఈరోజు ఉదయం 5.30 గంటలకు అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారినట్లు పేర్కొంది.

ఇది రాబోయే 12 గంటలలో ఉత్తరం వైపుకు వెళ్లి తూర్పు మధ్య అరేబియా సముద్రం, ఆగ్నేయ దిశగా తుఫానుగా మారే అవకాశం ఉందని IMD మంగళవారం మధ్యాహ్నం వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది. ఈ తుఫాన్ కు బైపర్ జోయ్ గా పేరు పెట్టారు. వచ్చే ఐదు రోజుల్లో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వేడిగాలులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. జూన్ 10 వరకు కేరళ, కర్ణాటక, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

వచ్చే ఐదు రోజులలో కేరళ, లక్షద్వీప్, దక్షిణ కర్ణాటకలలో ఉరుములు,మెరుపులు,ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. రానున్న ఐదు రోజుల్లో కోస్తా, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. జూన్ 6, 7, 10 తేదీలలో అండమాన్, నికోబార్ దీవులలో, జూన్ 6 నుంచి 10 వరకు కేరళలో, జూన్ 9 మరియు 10 తేదీలలో దక్షిణ కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.