సీఎం జగన్ చేతికి బీజేపీ కొత్త అస్త్రం, కలిసొచ్చేనా – టీడీపీలో అదే టెన్షన్..!!

ఏపీలో పొత్తుల లెక్కలు తేలుతున్నాయి. ఇప్పటి దాకా జరిగిన చర్చలు..ప్రతిష్ఠంభనకు మూడు సభలతో క్లారిటీ వచ్చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన తరువాత అసలు బీజేపీ ఆలోచన ఏంటనే చర్చ మొదలైంది.

ఇప్పుడు టీడీపీతో కలుస్తామని నేరుగా చెప్పకపోయినా..పార్టీ అధ్యక్షుడు నడ్డా..హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు మాత్రం అవే సంకేతాలు ఇచ్చాయి. బీజేపీ మద్దతు తనకు లేదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. బీజేపీ నుంచి సంకేతాలు వస్తున్న వేళ సీఎం జగన్ చేతికి కొత్త అస్త్రం అందింది. అదే ఇప్పుడు టీడీపీలో కొత్త టెన్షన్ మొదలైంది.

మూడు పార్టీలు కలుస్తాయా: ఏపీలో 2014 పొత్తులు రిపీట్ అవ్వటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలో ఇప్పటి వరకు టీడీపీతో పొత్తు పైన విముఖంగా ఉన్న బీజేపీ నేతల తీరులో మార్పు కనిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో బీజేపీ కీలక నేతలు సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కొత్త ప్రతిపాదన చేసారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని ప్రతిపాదించారు. దీని పైన బీజేపీ నేతలతోనూ చర్చించారు. తరువాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి దీనికి కొనసాగింపుగా ప్రతిపాదనలు అందించారు. తాజాగా ఏపీ కేంద్రంగా నడ్డా.. అమిత్ షా ఏపీ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలు..ముఖ్యమంత్రి స్పందనతో జరిగేదేంటో క్లారిటీ వచ్చేసింది.