COWIN : కరోనా యాప్ ‘కోవిన్’ డేటా లీక్ ? టెలిగ్రామ్ యాప్ లో వైరల్..! రంగంలోకి కేంద్రం

కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కోవిన్ యాప్ డేటా లీక్ అయింది. ఈ డేటాను తస్కరించిన కొందరు సోషల్ మీడియా మెసేజ్ యాప్ టెలిగ్రామ్ లో పెట్టారు.

ఇవాళ టెలిగ్రామ్ లో కోవిన్ యాప్ డేటాకు సంబంధించిన లింకులు ప్రత్యక్ష్యం కావడంతో సర్వత్రా కలకలం రేగింది. ఈ వ్యవహారంతో కేంద్రం ఇరుకునపడింది. ఈ యాప్ ను కేంద్రమే నిర్వహిస్తున్న నేపథ్యంలో విమర్శలు రావడంతో విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం CoWIN పోర్టల్‌లో సైన్ అప్ చేసిన వారి ఆధార్, పాస్‌పోర్ట్ నంబర్‌లతో సహా భారతీయ పౌరుల సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని పెట్టిన టెలిగ్రామ్ గ్రూప్ ను కేంద్రం గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదో ఆటోమేటెడ్ ఖాతాగా గుర్తించారు. దీంతో ఈ సమాచారం బహిరంగం చేసిన వారిపై చర్యలకు కేంద్రం సిద్ధమవుతోంది. అదే సమయంలో కోవిన్ యాప్ లో రిజిస్టర్ అయిన వారిలో ఆందోళన మొదలైంది.

కోవిన్ డేటా ఎక్కడ లీక్ అయిందన్న దానిపై అంచనా వేయడానికి, డేటా ప్రభుత్వ డొమైన్ వెలుపల ఉన్న వ్యక్తుల చేతుల్లోకి పడిందో అంచనా వేయడానికి దర్యాప్తు జరుగుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టెలిగ్రామ్ ఖాతా సాధారణ వ్యక్తులే కాకుండా రాజకీయ పార్టీలు, సీనియర్ బ్యూరోక్రాట్‌ల నుండి ఉన్నత స్థాయి రాజకీయ నాయకుల వ్యక్తిగత సమాచారాన్ని ఇందులో ఉంచినట్లు తెలుస్తోంది.

CoWIN పోర్టల్ ద్వారా సైన్ అప్ చేసిన తర్వాత టీకా తీసుకున్న 100 కంటే ఎక్కువ మంది ప్రధాన వ్యక్తులపై ఈ లీక్ ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. ఇందులో 12-14 సంవత్సరాల మధ్య వయస్సు గల 4 కోట్ల కంటే ఎక్కువ మంది పిల్లలు, 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 37 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది సీనియర్ సిటిజన్‌లు ఉన్నారు. ఉదయం నుండి ఇన్ యాక్టివ్ గా ఉన్న టెలిగ్రామ్ ఖాతా, వ్యక్తులు CoWIN పోర్టల్ కోసం సైన్ అప్ చేసిన ఫోన్ నంబర్‌ను సాధారణ పరిభాషలో బాట్ అని పిలిచే ఆటోమేటెడ్ ఖాతాకు మెసేజ్ చేసినప్పుడు వారి వ్యక్తిగత వివరాలను చూపుతోంది.