Headlines

24/7 ఉచిత కరెంటుపై రేవంత్ ఛాలెంజ్

రైతులకు 24/7 కరెంటుపై తెలంగాణ అధికార పార్టీకి, ప్రతిపక్షం కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదన్న రేవంత్ కామెంట్స్ పై బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.

రైతులపై కాంగ్రెస్ కు ఎలాంటి చిత్తశుద్ధి లేదంటూ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే రంగంలోకి దిగారు. తెలంగాణ రైతాంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందిస్తామని ప్రకటించారు. అయినప్పటికీ కాంగ్రెస్ పై బీఆర్ఎస్ విమర్శలు చేస్తూనే ఉన్నది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కెసిఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల ఉచిత విద్యుత్ పై అధికార పార్టీకి ఛాలెంజ్ విసిరారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మొత్తం 3500 సబ్‌స్టేషన్‌లను సందర్శించి కరెంట్ లైన్‌ను తనిఖీ చేద్దాం. 24 గంటల నాన్‌స్టాప్ విద్యుత్ సరఫరా చేసినట్లు తేలితే మేము అక్కడ ఓట్లు అడగము. కానీ పక్షంలో మీరు ఆయా గ్రామాల్లో ఓట్లు అడగొద్దు అంటూ ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నట్టు రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వట్లేదని రుజువైతే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రజలను క్షమించమని వేడుకుంటారా అని సూటిగా ప్రశ్నించారు రేవంత్.