మంత్రి కోమటి రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి..!

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదవ రోజు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశోత్తారాలపై చర్చను సభాపతి రద్దు చేశారు. ఆర్థిక నిర్వహణ , ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్‌పై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై సభలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి .. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. వ్యక్తిగత దూషణలతో ఒక్కసారిగా అసెంబ్లీ వేడెక్కింది. నల్లగొండలో జగదీశ్‌రెడ్డికి క్రిమినల్‌ రికార్డు ఉందని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. దీంతో మంత్రి ఆరోపణలపై సవాల్‌కు సిద్ధమని జగదీశ్‌రెడ్డి అన్నారు. తాను కూడా ఛాలెంజ్‌కి సిద్ధమేనంటూ మంత్రి సవాల్ చేశారు. హత్యకేసులో జగదీశ్‌రెడ్డి 16 ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగారని, నిరూపించలేకపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి అన్నారు.

 

జగదీష్‌రెడ్డిపై మర్డర్ కేసులున్నాయని, ఆయన తండ్రి మీద అనేక కేసులున్నాయని, ఎన్టీఆర్ సీఎంగా ఉన్న టైంలో ఎక్సైజ్ కేసులు కూడా ఉన్నాయని : మంత్రి కోమటిరెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే పెట్రోల్‌బంక్‌లో దొంగతనం కేసులో ఆయన నిందితుడని, జగదీశ్‌రెడ్డిని ఏడాది పాటు జిల్లా నుంచి బహిష్కరించారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.

 

మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై మూడు హత్య కేసులు పెట్టారని.. ఆ మూడు కేసుల్లో న్యాయస్థానం నిర్దోషిగా తేల్చిందన్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం సమయంలో తనపై కేసులు ఉన్నాయని.. అవి తప్ప ఇంకా ఏమైనా కేసులు తనపై ఉంటే హౌస్ కమిటీ వేయాలని సభాపతిని కోరారు. నిరూపిస్తే అసెంబ్లీతో తన సీటు నుంచి స్పీకర్ చైర్ వరకు ముక్కు నేలకు రాసి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. నిరూపించలేని పక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి తమ పదవులకు రాజీనామా చేయాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి.. సీఎం రేవంత్‌ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని వివిధ సబ్జెక్టులపై చర్చ వస్తే దానిపై కూడా మాట్లాడతామని, కానీ ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఉన్న డిమాండ్‌కు సంబంధించి చర్చ జరుగుతోందని దానిపైనే సభ్యులు మాట్లాడాలని ఆయన సూచించారు.పవర్‌కు సంబంధించి చర్చ జరుగుతోందని దానిపై చర్చ జరగాలని మంత్రి శ్రీదర్ బాబు మరొక్కసారి సభ్యులకు సూచించారు..