Headlines

మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి CBI అధికారులు

గత కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాలను ఈడీ, ఐటీ సోదాలు కుదిపేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సీబీఐ ఎంట్రీ ఇచ్చేసింది. బుధవారం రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి ఓ బృందం వచ్చింది. కరీంనగర్ లోని ఆయన ఇంటికి వచ్చిన అధికారులు… కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు మంత్రి గంగుల ఇవాళ ఉదయమే కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్లారు. ఏ కేసులో..? మంత్రి లేకపోవటంతో ఆయన కుటుంబ సభ్యులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని తెలిపినట్లు సమాచారం. అయితే ఏ కేసులో మంత్రికి నోటీసులు ఇచ్చారనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మధ్య ఆయనపై ఈడీ, ఐటీ సోదాలు జరిగాయి. గ్రానైట్ వ్యవహారంపై విచారించాయి. పలు డాక్యూమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సోదాలు.. చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సీబీఐ ఎంట్రీ ఇవ్వటంపై… మరో అంశం తెరపైకి వస్తోంది. గతంలో విశాఖకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి నకిలీ సీబీఐ పేరుతో అక్రమాలకు పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఇటీవల కాపు సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్ తో ఫొటోలు దిగాడు శ్రీనివాస్. వీటిని సీబీఐ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రి గంగులకు ఏమైనా నోటీసులు ఇచ్చారా..? లేక మరేదైనా కేసులో విచారించనున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈడీ, ఐటీ సోదాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రం దాడులు చేయిస్తోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కొద్దిరోజుల కిందటే మంత్రి మల్లారెడ్డి టార్గెట్ గా విస్తృత సోదాలు చేసింది ఐటీ. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. నోటీసులు జారీ చేయగా… విచారణకు కూడా హాజరయ్యారు. మరోసారి కూడా హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యే సీబీఐ విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో సీబీఐ దర్యాప్తుకు అనుమతులు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు రాష్ట్ర మంత్రికి నోటీసులు ఇవ్వటం సంచలనం సృష్టిస్తోంది. మరీ ఈ నోటీసులపై మంత్రి గంగుల ఎలా స్పందిస్తారనేది చూడాలి.