Headlines

తెలంగాణ(Telangana)లో మూడేళ్లలో 1228 చిన్నారులు అదృశ్యం

తెలంగాణ(Telangana)లో మూడేళ్లలో 1228 చిన్నారులు అదృశ్యం అవ్వగా.. అందులో 440 మంది మాత్రమే దొరికారు. దేశవ్యాప్తంగా ఇదే కాలంలో అదృశ్యమైన 1,40,575 మంది చిన్నారుల్లో 1,25,445 మంది ఆచూకీ లభించింది. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ (పోక్సో) చట్టం కింద నమోదైన కేసుల్లో శిక్ష పడిన వ్యక్తుల రేటు 2021కి 16 శాతం తగ్గిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 2021లో 100 మందికి, 2020లో 120 మందికి, 2019లో 108 మందికి శిక్ష పడింది. 2021లో 2,698 పోక్సో కేసులు నమోదయ్యాయి. 2020లో 2,074, 2019లో 1,998 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా పోక్సో కేసుల్లో 6,080 మందికి శిక్ష పడింది. మరోవైపు తెలంగాణ(Telangana)లో మహిళలపై లైంగిక వేధింపులు 2020 నుండి 2021 వరకు 17 శాతానికి పైగా పెరిగాయని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమర్పించిన గణాంకాలు చెబుతున్నాయి.

తెలంగాణలో 2021లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి 20,865 కేసులు నమోదయ్యాయని, 2020లో 17,791 కేసులు, 2019లో 18,394 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. 2019లో దేశవ్యాప్తంగా 4,05,326 కేసులు, 2020లో 3,71,503, 2021లో 4,28,278 కేసులు నమోదయ్యాయి. మహిళల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నా.. ఇలాంటి కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2016-17 నుంచి 2021-22 వరకు నిర్భయ నిధుల్లో 16 శాతం వినియోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) విఫలమైందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. తెలంగాణకు కేంద్రం రూ.238.06 కోట్లు విడుదల చేసిందని, అందులో రాష్ట్రం రూ.200.95 కోట్లు వినియోగించుకుందని తెలిపింది. మహిళల భద్రత మరియు భద్రతను పెంపొందించడానికి ఉద్దేశించిన కార్యక్రమాలను అమలు చేయడానికి ఈ నిధిని ఏర్పాటు చేశారు.