Headlines

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం

 

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిట్ దర్యాప్తుని నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు… కేసు విచారణని సీబీఐకి బదిలీ చేసింది. సిట్ దర్యాప్తు పట్ల నమ్మకం లేదని .. ఈ కేసును సీబీఐ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరిపించాలని వేసిన పిటిషన్ ను న్యాయస్థానం అంగీకరించింది. ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులు… సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. సిట్ దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు దశలో ఉండగా.. ఫామ్ హౌస్ లో వీడియోలు, ఆడియోలు సీఎం కేసీఆర్ కు చేరడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మీడియాకు రిలీజ్ చేసిన ఫుటేజీను కోర్టుకు అందించారు. దీంతో పిటిషనర్లు అందించిన ఫుటేజ్ ను పరిగణలోకి తీసుకుంటామన్న హైకోర్టు.. ఇవాళ వాదనలు ముగిసిన తర్వాత ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంలో మొత్తం ఐదు పిటిషన్లు దాఖలు కాగా… బీజేపీ వేసిన పిటిషన్ ను టెక్నికల్ గ్రౌండ్ సరిగ్గా లేదనే కారణంతో హైకోర్టు తిరస్కరించింది. నిందితులు వేసిన పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం… వారి తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించింది. కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం… సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు నిలిపివేయాలని ఆదేశించింది. సిట్ నమోదు చేసిన కేసులు, రిమాండ్ రిపోర్టులు చెల్లవని స్పష్టం చేసింది. వారు ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, ఇతర సమాచారం మొత్తం సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. మరోవైపు… రాష్ట్రంలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో.. హైకోర్టు తీర్పు సంచలనంగా మారింది. అయితే.. ఈ కేసులో స్వయంగా హైకోర్టు ఆదేశించినందున… దర్యాప్తు కోసం మరోసారి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హైకోర్టు తీర్పుతో… ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కీలక మలుపు తీసుకున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. హైకోర్టు తీర్పుని సుప్రీం కోర్టు లో సవాల్ చేస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.