టీడీపీలోకి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు – అనర్హత వేటు..!?

నెల్లూరు కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ కంచుకోటలో ఆ పార్టీని దెబ్బ తీయటానికి టీడీపీ వరుస వ్యూహాలు అమలు చేస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ..ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసారని జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేసింది.

ఇప్పుడు వారు టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ముందుగా లోకేష్ యాత్రలో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో వారి పైన అనర్హత వేటు దిశగా చర్చల మొదలైంది. వారు రాజీనామా చేస్తారా..వారి పై అనర్హత వేటు వేస్తారా అనేది ఉత్కంఠను పెంచుతోంది.

టీడీపీలో చేరేందుకు సిద్దం: నెల్లూరులో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు అధికారికంగా టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాజీనామా చేసి పార్టీలో చేరేందుకు సిద్దమని చెప్పారు. రాజీనామా అంశం పార్టీ పోలిట్ బ్యూరోలో చర్చించిన తరువాత నిర్ణయిద్దామని చంద్రబాబు సూచించారు.

మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇంటికి వెళ్లిన టీడీపీ నేతలు పార్టీ లోకి రావాలని ఆహ్వానించారు. అటు మేకపాటి చంద్రశేఖర రెడ్డి నేరుగా లోకేష్ ను కలిసి పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. ఈ ముగ్గురు నేతలు టీడీపీలో చేరేందుకు సిద్దమైనా..ముందుగా లోకేశ్ పాద యాత్ర ఈ నెల 13న నెల్లూరు జిల్లాలో ప్రవేశిస్తోంది. ఈ ముగ్గురు లోకేశ్ యాత్రలో పాల్గొని..జిల్లాలో సక్సెస్ చేసే బాధ్యతల్లో భాగస్వాములు అవుతున్నారు.

లోకేశ్ యాత్రకు మద్దతుగా: లోకేశ్ పాదయాత్ర తరువాత తెలుగుదేశంలో చేరుతానని ఆనం ప్రకటించారు. మేకపాటి, కోటంరెడ్డి అదే ఆలోచనలో ఉన్నారు. ఈ ముగ్గురి ఎమ్మెల్యేల అడుగుల పైన వైసీపీ నాయకత్వం కన్నేసి ఉంచింది. వారిసి సస్పెండ్ చేసినా… సాంకేతికంగా ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు రాజీనామా చేయకుండా లోకేశ్ పాదయాత్రలో పాల్గొంటే వైసీసీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది.

ఈ ముగ్గురు తాము ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరటం ద్వారా ఎన్నికల సమయానికి నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్ కు దగ్గరవ్వటంతో పాటుగా.. పార్టీ అభ్యర్ధులుగా పని చేసుకోవటానికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. కానీ, ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసి లోకేశ్ యాత్రలో పాల్గొంటారా లేక ఎమ్మెల్యేలుగా ఉంటూనే లోకేశ్ యాత్రకు వెళ్తారా అనేది ఇప్పుడు కీలక అంశంగా మారుతోంది.