ఏపీలో ఆ ఇద్దరు నేతలతోనే – మంత్రి హరీష్ కీలక వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్ నేతలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ నేతల మాటలు కోటలు దాడుతాయని..చేతలు మాత్రం తక్కువని విమర్శించారు.

ఏపీకి చెందిన ఇద్దరు నేతల తీరు కారణంగా ఆ రాష్ట్రం బోర్లా పడిందని కామెంట్ చేసారు.

ఏపీ, గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి చూస్తే తెలంగాణ గొప్పతనం తెలుస్తుందంటూ హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు తలెత్తుకునేలా సీఎం కేసీఆర్ అభివృద్ది చేశారని.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొడుతోందని విమర్శించారు.

 

గతంలో పలు సందర్భాల్లో ఏపీ నేతల పైన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి హరీష్ మరోసారి కామెంట్స్ చేసారు. ఓ నేత తనను తాను దేశంలో ఉత్తమ అడ్మినిస్ట్రేటర్గా..హైటెక్ నేతగా చెప్పుకొనే వారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు తక్కువ మాట్లాడుతూ..చేతల్లో దేశానికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకించి తప్పు చేసానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించినట్లు తాను విన్నానని..అప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారు ఇప్పుడు బాధ పడుతున్నారన్నారు.

తెలంగాణ ఏర్పడితే చీకట్లే మిగులుతాయని..నక్సలైట్ల రాజ్యం వస్తుందని..హైదరాబాద్ లో నిత్యం కర్ఫ్యూ వస్తుందని చెప్పిన వారి మాటలు పూర్తి అవాస్తవమని కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలన నిరూపించిందని హరీష్ చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు తల ఎత్తుకొనేలా చేసారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 60 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు పథకంలో రూ 60 వేల కోట్లు జమ అయ్యాయని వివరించారు.

ధరణి పోర్టల్ కారణంగానే ఇది సాధ్యమవుతోందన్నారు. దివ్యాంగులకు ఫించను పెంపు ప్రకటనను హర్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మంత్రి హరీష్ దివ్యాంగులతో కలిసి పాలాభిషేకం చేసారు. తెలంగాణ గొప్పదనం తెలియాలంటే పొరుగు రాష్ట్రాల్లో పరిస్థితులు చూడాలని వ్యాఖ్యానించారు.