ఏలూరు రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం: ఎగిసిన మంటలు, బోగి పూర్తిగా దగ్ధం

పశ్చిమగోదావరి: ఇటీవల వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రజలను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

ఈ ప్రమాదం తర్వాత కూడా పలు రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

రైల్వే టెక్నికల్ వ్యాగన్‌లో మంటలు చెలరేగాయి. వ్యాగన్లో ఆయిల్ టిన్నులు ఉన్నాయి. వాటికి మంటలు అంటుకోవడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో బోగీ మొత్తం దగ్ధమైంది. అయితే, వెంటనే స్పందించిన రైల్వే, అగ్ని సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు భయాందోళలకు గురై పరుగులు పెట్టారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఏలూరు రైల్వే స్టేషన్ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు పలువురు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వైరల్ గా మారాయి.

ఇది ఇలావుండగా, తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ రైల్వే స్టేషన్లోని సిగ్నలింగ్ కేబుల్ వ్యవస్థకు పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్ సమీపంలోని చిట్టడవిలో మంటలు అంటుకున్నాయి. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతోనే.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఫైరింజిన్ల సాయంతో మంటలు ఆర్పివేశారు. సిగ్నలింగ్ కేబుల్ వ్యవస్థకు మంటలు అంటుకుని ఉంటే పెను ప్రమాదం జరిగేదని సిబ్బంది చెప్పారు.