‘కస్టడీ’.. క్యూరియాసిటీ పెంచుతున్న చైతూ

సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఆకట్టుకుంటున్న హీరో నాగచైతన్య. ఆయన ఇటీవల చేసిన సినిమాలు లాల్ సింగ్ చద్దా, థ్యాంక్యూ నిరాశ పర్చినప్పటికీ, ఓ నటుడిగా మంచి మార్కులు పడ్డాయి. తాజాగా నాగచైతన్య – వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. కృతిశెట్టి కథానాయిక. ఈరోజు నాగచైతన్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దాంతో పాటు టైటిల్ కూడా ప్రకటించేశారు. ఈ సినిమాకి `కస్టడీ` అనే పేరు ఖరారు చేశారు.

ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో చైతూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చాడు. అరవింద్ స్వామికి ఓ కీలకమైన పాత్ర దక్కింది. `మానాడు` తరవాత వెంకట్ ప్రభు చేస్తున్న సినిమా ఇదే. నిజానికి `మానాడు`నే తెలుగులో రీమేక్ చేద్దామనుకొన్నారు. కానీ చేసిన సినిమానే మళ్లీ చేయడం ఇష్టం లేక.. నాగచైతన్యకు కొత్త కథ వినిపించడం, తను ఓకే చేయడం వెంటనే జరిగిపోయాయి. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా సాగిపోతోంది.