నియోజకవర్గంలో నిధుల కేటాయింపులో తెలంగాణ ప్రభుత్వం వివక్ష

నియోజకవర్గంలో నిధుల కేటాయింపులో తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాధవనేని రాసిన బహిరంగ లేఖలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం దుబ్బాకపై వివక్ష చూపడం సరి అయింది కాదని, రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలకు ఎలాగైతే నిధులు మంజూరు అవుతున్నాయో అలాగే దుబ్బాక నియోజకవర్గం కూడా నిధులు మంజూరు చేయాలని దుబ్బాక బీజేపీ శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా ఇన్చార్జ్ మంత్రి అయినా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు రాత పూర్వకంగా విన్నవించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాసిన లేఖలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా పనిచేస్తుందని గుర్తు చేశారు. అంతేకాకుండా రాజ్యాంగపరంగా ఎవరి హక్కులు వారికి కల్పిస్తుందని అన్నారు. రాజ్యాంగ హక్కులను ప్రభుత్వం కాలరాయడని ఆయన తెలిపారు. దేశానికి ఆదర్శవంత ప్రభుత్వంగా పనిచేస్తుందన్న దానికి సందేహం లేదని ఆయన పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గం ప్రజలు వారి సమస్యలు పరిష్కరిస్తానని తనపై నమ్మకంతో ఓట్ల ద్వారా తనను గెలిపించాలని అన్నారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు ఏసిడిఎఫ్ ప్రతి శాసనసభ్యునికి కేటాయిస్తుందని గుర్తు చేశారు. కానీ దుబ్బాక నియోజకవర్గనికి నిధులు మంజూరు చేయక శాసనసభ్యున్ని అగౌరపరచడం సరైంది కాదని అన్నారు. ఇప్పటికైనా దుబ్బాక నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని ఆయన ఆ లేఖలో కోరారు.