Headlines

తుని రైలు దహనం కేసులో విజయవాడ రైల్వే కోర్టు సంచలన తీర్పు

తుని రైలు దహనం కేసులో విజయవాడ రైల్వే కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

రైలు దహనం కేసును కొట్టివేస్తూ సోమవారం తీర్పు వెల్లడించింది. కాపు రిజర్వేషన్‌ పోరాట ఉద్యమంలో భాగంగా 2016 జనవరి 31న తునిలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు తెలుగు రాష్ట్రాలకు చెందిన కాపు నేతలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సభ జరిగిన అనంతరం అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో రైల్వే స్టేషన్‌ వద్ద ఉన్న రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఆందోళన కారులు దహనం చేశారు.

ఈ సంఘటనకు సంబంధించి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ప్రస్తుత మంత్రి దాడిశెట్టి రాజా, నటుడు జీవీతోపాటు మెుత్తం 41 మందిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణ రైల్వే కోర్టులో జరుగుతుంది. ఇప్పటికే వాదనలు విన్న రైల్వే కోర్టు తీర్పును మే 1వ తేదీకి వాయిదా వేసింది. కేసు విచారణలో భాగంగా సోమవారం కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతోపాటు పలువురు రైల్వే కోర్టుకు చేరుకున్నారు. అనంతరం రైల్వే కోర్టు కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపింది. 24మంది సాక్షుల్లో 20 మందిని విచారించిన కోర్టు అనంతరం కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

కాపు రిజర్వేషన్‌ సాధన కోసం 2016లో జనవరి 31వ తేదీన తూ.గో జిల్లా తునిలో భారీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హింసాత్మక ఘటనలు చెలరేగగా.. ఆందోళనకారులు రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టారు. దీంతో ఈ ఘటనలో అప్పట్లో 41 మందిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏ1గా ముద్రగడ పద్మనాభం, ఏ2 ఆకుల రామకృష్ణ, ఏ3 మంత్రి దాడిశెట్టి రాజా పేర్లను చేర్చారు. ఈ కేసులో వీరందరూ కోర్టుకు హాజరయ్యారు. 24 మంది సాక్షుల్లో 20 మంది విచారణకు హాజరవ్వగా.. ఇందులో ఐదుగురు తమకు ఏమీ తెలియదంటూ సాక్ష్యం చెప్పారు.

విచారణ పూర్తవ్వడంతో విజయవాడ రైల్వే కోర్టు తుది తీర్పును వెల్లడించింది. కోర్టును కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తు ప్రక్రియలో.. నేరం రుజువు చేయడంలో రైల్వే పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన ఆధారాలను కోర్టు ముందు ఉంచలేకపోయారని వెల్లడించింది. సంబంధిత అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో సమాధానం చెప్పాలని ప్రశ్నించింది. కాగా.. ఈ కేసులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. కోర్టు కేసు కొట్టేయడంతో ముద్రగడతోపాటు దాడిశెట్టి రాజాలకు భారీ ఊరట లభించింది.