Headlines

ఏపీలో కొత్తగా ఉప జిల్లాలు-నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్- ఎందుకంటే ?

ఏపీలో గతేడాది కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇవాళ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఏపీ విభజన సందర్భంగా రాష్ట్రంలో 13 జిల్లాలుగా ఉండగా..

ఆ తర్వాత ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తామన్న వైసీపీ హామీ మేరకు ప్రభుత్వం జిల్లాల విభజన చేపట్టింది. దీంతో జిల్లాల సంఖ్య 26కు పెరిగింది. ఇప్పుడు ఇదే క్రమంలో ప్రభుత్వం మరోసారి జిల్లాల్ని విభజిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏపీలో ప్రభుత్వంచేపట్టిన సమగ్ర భూసర్వే అనంతరం పాలనతో పాటు రిజిస్ట్రేషన్లు, ఇతర ప్రభుత్వ నిర్ణయాలు వేగంగా అమలయ్యే విధంగా ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న జిల్లాల్లోనే ఉప జిల్లాల్ని ఏర్పాటు చేస్తూ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం కొన్ని జిల్లాల్లో ఉప జిల్లాలు ఏర్పాటయ్యాయి. తాజా నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుత అనకాపల్లి, చిత్తూరు, కృష్ణా, పార్వతీపురం, మన్యం, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, కడప, కోనసీమ, ఏలూరు, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో కొత్తగా ఉప జిల్లాలు ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ తరఫున ఈ నోటిఫికేషన్ ను ప్రభుత్వం జారీ చేసింది. అలాగే ఈ నోటిఫికేషన్ తక్షణం అమల్లోకి వస్తుందని కూడా ప్రభుత్వం పేర్కొంది. కొత్తగా ఏర్పాటైన ఈ ఉప జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల విభజన కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాల్ని విభజిస్తూ నోటిఫికేషన్ లో ప్రత్యేకంగా ప్రకటించారు. దీని ప్రకారం ప్రస్తుత రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మార్పులు జరగబోతున్నాయి.

కొత్తగా ఏర్పాటైన ఉప జిల్లాల్లో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటవుతాయని ప్రభుత్వం నోటిఫికేషన్ లో తెలిపింది. అలాగే కొత్తగా ఏర్పాటయ్యే సదరు రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని కూడా ఇందులో వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ లో ప్రకటించిన గ్రామాలన్నీ ఇకపై కొత్త జిల్లాల పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. అలాగే గ్రామ సచివాలయాల పరిధుల్లోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.