Headlines

శ్రేష్ఠకు ఎంపికైన 21 మంది గురుకుల విద్యార్థులు

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం రూరల్, ఆగస్టు 01:

పెదతాడేపల్లిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు స్కీమ్ ఫర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ ఎస్సీ స్టూడెంట్స్ ఇన్ హైస్కూల్ టార్గెటెడ్ ఏరియా (శ్రేష్ట)కు మొదటి విడతలో 21 మంది విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ బి. రాజారావు తెలిపారు. మంగళవారం పాఠశాలలో శ్రేష్టకు ఎంపికైన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాజారావు మాట్లాడుతూ ఎస్సీ విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రవేటు పాఠశాలల్లో సీట్లు కల్పించి చదివించే నదుపాయం ఏర్పాటు చేయడం శ్రేష్ఠ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిన్ ఎన్ వర్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రవేశ పరీక్షలో దేశవ్యాప్తంగా 3 వేల మందికి అవకాశం లభిస్తుందన్నారు. ఈ ప్రవేశ పరీక్షలో గురుకుల పాఠశాల నుంచి 75 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సోమవారం జరిగిన మొదటి విడతలో 24 మంది విద్యార్థులు అర్హత సాధించడం అభినందనీయం అన్నారు. వీరికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, కేరళ, ఛత్తీస్గడ్ తదితర రాష్ట్రాల్లోని ప్రవేటు పాఠశాలల్లో సీట్లు లభిస్తాయని తెలిపారు. అత్యంత ప్రతిభ ఘనపరచిన విద్యార్థులు ఉన్నత విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రిన్సిపల్ రాజారావును విద్యార్థుల తల్లిదండ్రులు సత్కరించారు. సీట్లు సాధించిన విద్యార్థులను డిసిఓ ఎన్. భారతి, ప్రిన్సిపాల్ రాజారావు, వైస్ ప్రిన్సిపాల్ బి. ప్రతాప్, స్కూల్ కమిటీ చైర్మన్ ఆర్. శ్రీను, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది అభినందించారు.