పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, నవంబర్ 2:
లింగ నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్ లు, ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి హెచ్చరించారు.
గురువారం స్థానిక కలెక్టరేట్ చాంబర్ నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పి.సి అండ్ పి.ఎన్.డి.టి చట్టం అమలుపై సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని, ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ లింగ నిర్ధారణ పరీక్ష నిషేధిత చట్టం గురించి తెలుసుకుని అవగాహన చేసుకోవాలన్నారు. ప్రతి ఆడబిడ్డ జన్మించడానికి, ఎదగడానికి, చదవడానికి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఐఎంఈ, పోలీస్ టీంగా ఏర్పడి డెకాయ్ ఆపరేషన్ లను నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ సమాజంలో బాధ్యతగా మెలగాలని, లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు వారి దృష్టికి వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు. జిల్లాలో మొత్తం 120 అల్ట్రా స్కానింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయని, వాటిలో ప్రభుత్వం ఆస్పత్రిలో 15, ప్రైవేట్ ఆస్పత్రిలలో 105 ఉన్నాయన్నారు. కొత్తగా అల్ట్రా స్కానింగ్ సెంటర్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న ల్యాబ్లు, హాస్పటల్ ను పక్కాగా తనిఖీ చేయాలని, నిబంధనలను అతిక్రమిస్తే తీసుకునే చర్యలపై ముందుగానే తెలియ చెప్పాలన్నారు. సమాజంలో ఆడ, మగ అంతరాలు తొలిగెందుకు సంబంధిత వైద్యాధికారులు ప్రజలలో విస్తృత అవగాహన పెంచేలా నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.
ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పి ఏవి సుబ్బరాజు, డి.ఎం అండ్ ఎన్.హెచ్ ఓ డా.డి.మహేశ్వరరావు, అడిషనల్ డిఎం హెచ్ ఓ డాక్టర్ బి.భాను నాయక్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ దేవ సుధాలక్ష్మి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కీర్తి, ఐ ఆర్ సి ఎస్ చైర్మన్ డాక్టర్ ఎం.ఎస్.వి.ఎస్ బద్రి రాజు, మెడికల్ ఎక్స్పర్ట్స్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం. సుబ్బలక్ష్మి, న్యాయ సలహాదారు అడ్వకేట్ వి.సత్య రవి, ప్రీడియట్రీషియన్ డాక్టర్ కే.ప్రవీణ్ కుమార్, కమిటీ సభ్యులు యు.వి.రమణ రాజు, ఐఎంఏ సభ్యులు డాక్టర్ శంకర్ కుమార్, డాక్టర్ జి బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.