కెనడాలో శాశ్వతం స్థిరపడాలనుకునే వారికి గుడ్ న్యూస్.. 4.85 లక్షల మందికి పీఆర్..

కెనడాలో శాశ్వతంగా స్థిరపడాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. మరిన్న వలసలను కెనడా ప్రభుత్వం ప్రోత్సహించనుంది. వచ్చే ఏడాది 4.85 లక్షల మంది శాశ్వత నివాసితులను ఆహ్వానించనుంది.

2025 నాటికి 5 లక్షల మందిని స్వాగతిస్తామని ప్రకటించింది. దేశంలో వృద్ధాప్య జనాభా పెరగడంతో పాటు కీలక రంగాల్లో కార్మికుల కొరతని ఎదుర్కొంటోంది. భారతదేశం వంటి దేశాల నుంచి కొత్తగా అర్హత కలిగిన నిపుణుల సాయంతో కెనడా ఆర్థికవృద్ధిని పెంచుకోవాలని అనుకుంటోంది. వలసదారులు కెనడా ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా మారుతుందని ఇమ్మిగ్రేషన్, శరణార్థులు, పౌరసత్వ శాఖ మంత్రి మార్క్ మిల్లర్ బుధవారం మీడియా సమావేశంలో అన్నారు.

 

”పెరుగుతోన్న వృద్ధాప్య జనాభాతో పాటు ఆరోగ్య సంరక్షణ, రవాణా, గృహ నిర్మాణం వంటి కీలక రంగాల్లో కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో దేశ నూతన ఆవిష్కరణలు, ఆర్థిక వ్యవస్థ, స్థానిక వ్యాపారాలకు కొత్తవారు కీలకం” అని కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వశాఖ(IRCC) ఓ ప్రకటనలో తెలిపింది. వలసల ప్రణాళిక కింద కెనడా ప్రభుత్వం 2024లో 4.84 లక్షల మంది శాశ్వత నివాస హోదా కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025లో దీన్ని 5 లక్షలకు పెంచనుంది. 2026లో కూడా ఇదే సంఖ్య వద్ద స్థిరీకరించనుంది. దీనితో పాటు తాత్కాలిక నివాసితుల ప్రవేశాల సంఖ్యలోనూ మార్పులు చేపట్టేందుకు వచ్చే ఏడాది చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వం యోచిస్తోంది.

నైపుణ్య కలిగిన కార్మికులు, వ్యాపారులు, కుటుంబాల కోసం 100 కంటే ఎక్కువ కెనడియన్ ఇమ్మిగ్రేషన్ మార్గాలు ఉన్నాయి. 2022 కెనడా ఇమ్మిగ్రేషన్ డేటా ప్రకారం శాశ్వత నివాసితుల్లో భారతదేశానికి చెందిన వారే అగ్రస్థానంలో ఉన్నారు. భారత్ నుంచి కెనడాకు వెళ్లినవారిలో గతేడాది 1,18,095 మందికి పీఆర్ అందించింది. 2022లో 4,37,120 మందిని కెనడా పీఆర్ ఇవ్వగా.. ప్రతీ నలుగురు వ్యక్తుల్లో ఒకరు భారతీయులే. కెనడాలో జనాభా పెరుగుదలకు 98 శాతం వలసలే కారణం. వీరి వల్లే 2022లో కెనడాలో రికార్డు స్థాయిలో పది లక్షల జనాభా పెరిగినట్లు అంచనా.