Headlines

బాల్య వివాహాలను నిరోధించడంలో సంబంధిత అధికారులు కఠినంగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి..

 

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, డిసెంబర్ 1:

 

బాల్య వివాహాలను నిరోధించడంలో సంబంధిత అధికారులు కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు.

 

శుక్రవారం స్థానిక కలెక్టరేట్ చాంబర్ నందు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమై బాల్య వివాహాలు, పోషకాహార లోపం కలిగిన పిల్లలు, వైయస్సార్ సంపూర్ణ కిట్స్, ఫ్రీ స్కూల్ పిల్లల హాజరు, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు నిరోధించడంలో కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాల్య వివాహం చేసుకుంటే ఫోక్సో యాక్ట్ కింద కేసు పెట్టడంతో పాటు, సంబంధిత ఫోటోలు ఆధారంగా బైండోవర్ కేసులను బుక్ చేయాలని ఆదేశించారు. బాల్య వివాహాల పై ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని, జిల్లాలో ఒక్క కేసు నమోదు అయిన సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రతినెల చైల్డ్ కేర్ మీటింగ్ ను ఆర్డీవో స్థాయిలో నిర్వహించాలన్నారు. నెలలో మొదటి సోమవారం మూడో సోమవారం మండల కమిటీ తో సమావేశం నిర్వహించాలన్నారు. బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలను ఆ సమావేశాల్లో అవగాహన చేపట్టాలన్నారు. పోషకాహార లోపం కలిగిన పిల్లలను, రక్తహీనత కలిగిన గర్భవతులను గుర్తించి సరైన పోషకాహారాన్ని, వైద్యసహాయాన్ని అందించాలన్నారు. వంద రోజులు కార్యక్రమం నిర్ణయించుకుని కనీసం 50 శాతం మందిని సంపూర్ణ ఆరోగ్యంగా చేయాలన్నారు. వైయస్సార్ సంపూర్ణ కిట్స్ నూరు శాతం అందేలా చూడాలన్నారు. 6 నెలల నుండి మూడు సంవత్సరాలు మధ్య వయసు కలిగిన పిల్లలకు అంగన్వాడీ కేంద్రం ద్వారా ఇంటి వద్దకే నూరు శాతం పోషకాహారాన్ని అందజేయాలన్నారు. ప్రీ స్కూల్ పిల్లల హాజరు శాతం నూరు శాతం నమోదు కావాలన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కానాల సంగీత్ మాధుర్, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ పిడి బి.సుజాత రాణి, సిడిపిఓలు టి.సరస్వతి, సిహెచ్ ఇందిరా, వాణి విజయరత్నం, బి.ఊర్మిళ, తదితరులు పాల్గొన్నారు.